మామే హంతకుడు

Uncle  Suspects iIn The Murder Case  Arrest - Sakshi

పరువుహత్య కేసులో నిందితుల అరెస్టు

నల్లమాడ : మండల పరిధిలోని సి.బడవాండ్లపల్లిలో ఈనెల 3వ తేదీ జరిగిన ఎస్‌.ధనుంజయ(25) హత్యకేసులో మామే హంతకుడని తేల్చిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. గురువారం వారిని పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల ఎదుట హాజరుపరిచారు. అనంతరం సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి ఎస్‌ఐ సత్యనారాయణతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. సి.బడవాండ్లపల్లిలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ధనుంజయ, భార్గవి ఏడాదిగా ప్రేమించుకుంటూ వచ్చారు. ధనుంజయ బలిజ, భార్గవి వాల్మీకి బోయ సామాజిక వర్గాలకు చెందిన వారు. గతంలో రెండు దఫాలుగా వీరు ఇల్లు విడిచి పారిపోయారు. యువతి తల్లిదండ్రులు గిరిబాబు, కాటమ్మ తమ కుమార్తెను పిలుచుకొచ్చి సమీప బంధువు సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. యువతి భర్త వద్ద ఉండకుండా పెళ్లయిన మరుసటి రోజే ప్రియుని వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఈ జంట తిరిగి ఇంటినుంచి పారిపోయి వైజాగ్‌ చేరుకుంది.

ఆ సమయంలో వారిద్దరూ వివాహం చేసుకున్నారని, ప్రస్తుతం భార్గవి గర్భవతి అని గ్రామస్తుల సమాచారం. తమ కుమార్తె ప్రియుడితో కలిసి వైజాగ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు గ్రామపెద్దల సహకారంతో వారిని రప్పించి తమ ఇంట్లోనే అంతా కలిసిమెలిసి ఉన్నారు. అయితే ఇది అవమానంగా భావించిన గిరిబాబు సమీప బంధువులు, బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లికి చెందిన బి.కిష్టప్ప, రామ క్రిష్ణ, చంద్ర అనే వ్యక్తులతో కలిసి 3వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ధనుంజయను కొడవళ్లతో నరికి హత్య చేశారు. మృతుని సోదరి అరుణమ్మ ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు వీఆర్‌ఓ పెద్దన్న ఎదుట లొంగిపోగా తాము వెళ్లి అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి నాలుగు కొడవళ్లు, ఆరు సెల్‌ఫోన్లు, పల్సర్‌ మోటార్‌సైకిల్, రక్తం మరకలున్న దుస్తులు స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top