డిచ్‌పల్లిలో ప్రాణాలు తీసిన అతివేగం

Two Persons Died In Road Accident By Overspeed In Dichpally - Sakshi

సాక్షి, డిచ్‌పల్లి : అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన కానుల గంగవ్వ (78)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గంగవ్వ తన ఇద్దరి కొడుకుల వద్ద చెరో నెల రోజుల పాటు ఉంటుంది. గన్నారంలో ఉన్న పెద్ద కొడుకు వద్ద నెల రోజుల పాటు ఉన్న గంగవ్వను నిజామాబాద్‌లో స్థిరపడిన చిన్న కొడుకు కానుల భూమయ్య తన ఇంటికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వంగాల రవీందర్‌ (50), చిక్కడపల్లి గంగాధర్, కారు డ్రైవర్‌ భూమయ్యలతో కలిసి గన్నారం గ్రామానికి వెళ్లాడు. తల్లితో పాటు గ్రామానికి చెందిన కె.రాములును తీసుకుని కారులో ఉదయం 8.30 గంటలకు నిజామాబాద్‌కు బయలుదేరాడు. 

అతివేగంగా వెళ్తున్న కారు డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. టీఎస్‌ఎస్‌పీ ఏడో బెటాలియన్‌ ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారులో నుంచి రోడ్డుపై పడిన గంగవ్వ, రవీందర్‌లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను బెటాలియన్‌ సిబ్బంది సహాయంతో డిచ్‌పల్లి పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వీరిలో రాములు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు వంగాల రవీందర్‌ కొడుకు సందీప్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గంగవ్వ మృతి చెందడం, ఆమె కొడుకు గాయపడటంతో గన్నారం గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాద సమయంలో కారు వేగం సుమారు గంటకు 150 కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top