అనంతగిరి అడవిలో ఇద్దరి ఆత్మహత్య

Two People Committed Suicide In Ananthagiri forest - Sakshi

27 రోజుల తర్వాత వెలుగులోకి..

వివాహేతర సంబంధం బహిర్గతమవడంతో బలవన్మరణం!

బైక్, సెల్‌ఫోన్ల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

ధారూరు: ఓ మహిళ, మరో వ్యక్తి వికారాబాద్‌ జిల్లా అనంతగిరి అడవిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన 27 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. చెట్టుకు కేవలం అస్థిపంజరాలు మాత్రమే వేలాడుతుండడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అంటున్నారు. కోట్‌పల్లికి చెందిన జనగాం మహేందర్‌ (38) భార్యతో కలిసి ధారూరులో నివసిస్తున్నాడు. మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు పనిచేసే చోట ఇందోల్‌ గ్రామానికి చెందిన శివనీల (36) అనే కూలీతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు వీరి బంధం గుట్టుగా సాగింది. అనంతరం విషయం మహేందర్‌ భార్యకు తెలిసింది. దీంతో ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ విషయం శివనీల భర్తతో పాటు ఆమె కుటుంబీకులకు సైతం తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఏప్రిల్‌ 5న ధారూరులో ఉంటున్న మహేందర్‌ ఇంటికి వచ్చింది. అనంతరం ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా బైక్‌పై పారిపోయారు. ఈ విషయం తెలియని రెండు కుటుంబాల వారు కోట్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఇద్దరి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టగా అనంతగిరి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి.

అయితే, శనివారం ఉదయం పశువుల కాపర్లకు అడవిలో ఓ చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. మహేందర్, శివనీల ఏప్రిల్‌ 5న అటవీ ప్రాంతానికి వచ్చి చెట్టుకు చీరతో ఉరివేసుకున్నారని భావిస్తున్నారు. వారు మృతిచెంది సుమారు నెల రోజులు కావడంతో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరాలుగా మారాయి. సంఘటన స్థలంలో దొరికిన బైక్, సెల్‌ఫోన్ల ఆధారంగా పోలీసులు మృతులను గుర్తించారు. అనంతరం ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్పీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం ఇరు కుటుంబాల్లో తెలిసిపోవడం, సమాజంలో నిందలు భరించలేక ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top