ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది

Two Muslim Child Dead In Khammam - Sakshi

క్వారీ నీటి గుంతలో మునిగి చిన్నారుల మృతి  

పండగ రోజు రెండు ముస్లిం కుటుంబాల్లో విషాదం

ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. పవిత్రమైన బక్రీద్‌ పండగ రోజే ముస్లిం చిన్నారులు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు క్వారీ గుంతలో పడి జల సమాధి అయ్యారు.
 

సాక్షి, ఖమ్మం: ఇద్దరు చిన్నారులు క్వారీ నీటి గుంతలో మునిగి మృత్యవాత పడిన విషాదఘటన నగరంలోని 6వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌ కాలనీ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, సీఐ సాయి రమణ కథనం ప్రకారం.. డోర్నకల్‌ మండలం తహసీల్దార్‌ బంజరకు చెందిన శానిటేషన్‌ వర్కర్‌గా పని చేసే సలీం ఐదేళ్ల క్రితం ఖమ్మం వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు నాగుల్‌(8) నగరంలోని బల్లేపల్లి పాఠశాలలో చదువుతున్నాడు. చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ జానీ గత ఏడాది నుంచి ఖమ్మంలో ఉంటున్నాడు. కుమారుడు ఎస్‌కె మున్నా(6) నగరంలోని రస్తోగినగర్‌లో చదువుతున్నాడు.

సలీం, జానీ సమీప బంధువులు కావడంతో బక్రీదు పర్వదినం సందర్భంగా సోమవారం ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకున్నారు. మధ్యాహ్నం వరకు సరదాగా  గడిపారు. భోజనం తర్వాత ఆటలాడుకుంటామని ఇద్దరు పిల్లలు నాగుల్, మున్నా బయటకు వచ్చారు. ఆటలాడుకుంటామని వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో ఆరా తీశారు. వారి కోసం వెతుకుతుండగా..  వైఎస్‌ఆర్‌ కాలనీ ఆనుకుని ఉన్న క్వారీ నీటి గుంత ఒడ్డున దుస్తులు ఉన్నాయని కాలనీకి చెందిన యువకులు సమాచారం ఇచ్చారు. భయభయంగానే వెళ్లిన కుటుంబ సభ్యులకు వారి పిల్లల దుస్తులు కనిపించాయి. నీటి గుంతలో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగిన చిన్నారులు.. వయసు పెద్దగా లేకపోవడం, ఈతపై అవగాహన లేకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు.

సెలవురోజే చివరి రోజా..  
సెలవు రోజే చివరి రోజు అయిందా బిడ్డా..అంటూ చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాఠశాల ఉండి ఉంటే తమ బిడ్డలు బడికి పంపే వారమని, బడికి పోతే తమకు ఈ కడుపు కోత ఉండేది కాదంటూ ఆ తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బక్రీదు పర్వదినం రోజు సరాదాగా గడుపుతున్న సమయంలో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. అంతా పండగ సంబరాల్లో ఉన్న తరుణంలో కంటికి రెప్పలా పెంచుకుంటున్న బిడ్డలను పోగొట్టుకున్న తల్లితండ్రుల రోదనలు వర్ణనాతీతంగా మారింది.

మృతదేహాల తరలింపు 
ప్రమాదం సమాచారం అందుకున్న ఖమ్మం అర్బన్‌ సీఐ సాయిరమణ సంఘటన ప్రాంతా న్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అక్కడికి ఎలా వెళ్లారో..? 
క్వారీ నీటి గుంత ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లాలంటే పెద్దవారే కష్టంమీద వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తయిన మట్టి దిబ్బను, కంపచెట్లను దాటి ఇద్దరు చిన్నారులు ఎలా వెళ్లారని, దిగలేనివిధంగా ఉన్న క్వారీ గుంతలో ఎలా దిగారోనంటూ సంఘటన స్థలాన్ని పరిశీలించిన స్థానికులు పేర్కొంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top