పెళ్లింట విషాదం

Two Men Died in Bike Accident Kurnool - Sakshi

మోటారు సైకిల్‌ను ఢీకొన్న బొలెరో

బావ, బావమరిది మృతి

పెళ్లి దుస్తుల కోసం వెళ్తుండగా దుర్ఘటన

కర్నూలు, ఆదోని టౌన్‌: నూతన వరుడికి పెళ్లి దుస్తులు, చెప్పులు తీసుకొచ్చేందుకు వెళ్తున్న బావ, బావమరిది తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ దుర్ఘటన మంగళవారం ఆదోని పట్టణంలో చోటు చేసుకుంది. తాలూకా ఎస్‌ఐ రామాంజులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన నాగేంద్రకు పెళ్లి దుస్తులు తీసుకొచ్చేందుకు వరుసకు అన్న అయిన మార్క్‌ అలియాస్‌ మారెన్న, బావ మరిది రామాంజనేయులు మోటార్‌ సైకిల్‌పై ఆదోనికి బయలు దేరారు. ఆదోని మండలం నాగలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న సీఎంఎస్‌ కంపెనీకి చెందిన బొలెరో వాహనం మోటార్‌ సైకిల్‌ను ఢీ కొట్టింది. స్కూటర్‌పై ప్రయాణం చేస్తున్న రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.

మార్క్‌ అలియాస్‌ మారెన్న తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మారెన్న కూడా మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మార్క్‌ అలియాస్‌ మారెన్నకు  భార్య అంజినమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామాంజనేయులుకు ఏడాది క్రితమే పెళ్లయింది. సంతానం కలగలేదు. మారెన్న మృతిచెందడంతో భార్య, ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు. తమకు దిక్కెవరంటూ మృతుల భార్యలు అంజినమ్మ, ఇందు..ఆదోని ఆస్పత్రి ఆవరణలో నేలపై పడి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.  పింఛన్‌ చేయిస్తానని పదేపదే చెప్పిన కుమారుడు మారెన్న తమను విడిచి తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో మృతుని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తాలూకా ఎస్‌ఐ రామాంజులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

మృతదేహంతో ధర్నా
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు మంగళవారం రాత్రి భీమాస్‌ సర్కిల్‌లో ఆందోళన చేశారు. పోస్టుమార్టం అనంతరం రామాంజనేయులు మృతదేహంతో భీమాస్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు శాంతకుమార్, కుటుంబ సభ్యులు మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం యజమానులను రెండు గంటల్లోగా పిలిపిస్తామని చెప్పిన పోలీసులు ఐదు గంటలు గడిచినా ఎవరినీ పిలిపించలేదన్నారు. దళితులకు అన్యాయం చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని శాంతకుమార్‌ ఆరోపించారు. పోలీసుల చర్యల పట్ల తమకు నమ్మకం ఉన్నప్పటికీ వాహనం యజమానుల ఒత్తిళ్ల మేరకు తమకు న్యాయం చేయలేకపోతున్నారనే సందేహం కలుగుతోందన్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్‌ సీఐ భాస్కర్, ఎస్‌ఐ, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులకు సర్దిచెబుతూ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సమాధానం చెప్పడంతో ఆందోళన విరమించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top