ఉసురు తీసిన అప్పులు 

Two Farmers Commited Suicide Due To Debts In Prakasam - Sakshi

తీవ్ర వర్షాభావం..తెగుళ్లతో సాగు చేసిన పంట పొలంలోనే ఎండిపోయింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి రూపాయి కూడా ఇంటికి చేరలేదు. ఏటికేడు అప్పులు పెరిగాయి. సాగు కోసం తెచ్చిన అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి. ఫలితంగా మూడేళ్ల సాగు కాలంలో నష్టాలే తప్ప చేతికి రూపాయి వచ్చింది లేదు. ఒక వైపు కుటుంబ పోషణ భారమైంది. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరిగి మానసిక వేదనకు చెందిన రైతు పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఒకే రోజు రెండు చోట్ల జరిగాయి. ఒక సంఘటన అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెంలో జరగగా రెండో సంఘటన ఇంకొల్లు మండలం హనుమోజిపాలెంలో జరిగింది.  

సాక్షి, ప్రకాశం : మండలంలోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన యువ కౌలురైతు  పురుగుమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామానికి చెందిన గోపు శ్రీనివాసరెడ్డి గ్రామంలో మోటార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన గోవిందమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సుభాష్‌రెడ్డి, నవ్య సంతానం. కుమారుడు ఒంగోలులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. కుమార్తె దర్శిలో 9వ తరగతి చదువుతోంది. నాలుగేళ్ల క్రితం జీవనాధారం కోసం భార్యపుట్టిల్లు కొత్తరెడ్డిపాలెం వచ్చి నివాసం ఉంటున్నారు. సెంటు భూమిలేని శ్రీనివాసరెడ్డి మూడేళ్ల నుంచి 2 ఎకరాల భూమిని ఎకరాకు రూ.25 వేలకు చొప్పున కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేసేవాడు.

మొదటి సంవత్సరం కౌలు చెల్లింపు కోసం రూ.50 వేలు, పెట్టుబడి కోసం రూ.2 లక్షలు మొత్తం రూ.2.5 లక్షలు బంధువులు, తెలిసిన వారి వద్ద 2 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి కట్టాడు. మొదటి సంవత్సరం మిర్చి పంట సాగు చేశాడు. వర్షాభావం వెంటాడి తెగుళ్లతో ఒక్క కాయ కూడా ఇంటికి చేరలేదు. నిరుడు, ఈ ఏడు అదే రెండెకరాల భూమిలో మిర్చి సాగు చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. సాగు కోసం, కౌలు చెల్లింపుల కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో కలుపుకుని మొత్తం రూ.10 లక్షల వరకు బాకీ తేలింది. ఇదిలా ఉండగా తన ఇద్దరు పిల్లలకు కంటి చూపు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. రెండు రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలతో ఒంగోలులోని ఓ కంటి వైద్యశాలకు వెళ్లి పరీక్ష చేయించాడు. వారి వైద్యానికి రూ.25 వేలు చొప్పున అవుతాయని అక్కడి వైద్యులు చెప్పారు. 

పెరుగుతున్న అప్పులతో సతమతం
ఒక వైపు సాగు కోసం తెచ్చిన అప్పులు పెరిగి పోవడం.. మరోవైపు పిల్లల కంటి చికిత్స కోసం అప్పు తేవాల్సి రావడం.. ఇదివరకు అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బు ఇవ్వమని వత్తిడి చేయడంతో మానసిక వేదనకు గురైన శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం భార్యకు పొలం వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో పొలం వెంబడి దారిలో నడిచి వెళ్లే బటసారులు విగత జీవుడై పడిపోయిన శ్రీనివాసరెడ్డిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న  కుటుంబ సభ్యులు భోరున విలపిస్తూ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. 

మిన్నంటిన రోదనలు 
ఉదయం వరకు తనతో అప్పుల గురించి చర్చించి పొలం వెళ్లి వస్తానని చెప్పిన భర్త విగత జీవుడై ఇంటికి చేరిన భర్తను చూసిన భార్య.. తమకు తండ్రి లేడని తెలిసిన పిల్లలు రోదించిన తీరు అక్కడ డున్న వారి హృదయాలను కదిలించింది. అందరితో కలిసి మెలిసి వరస కలుపుకుంటూ పలకరించే శ్రీనివాసరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

మరో రైతు కూడా.. 
హనుమోజిపాలెం (ఇంకొల్లు) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని హనుమోజిపాలెం గ్రామానికి చెందిన బండారు రామాంజనేయులు (50) కొంతకాలంగా వ్యవసాయం చేస్తున్నాడు. తనకు ఉన్న ఎకరం సొంత పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తన సొంత పొలం ఎకరంలో మిర్చి, కౌలుకు తీసుకున్న 3 ఎకరాల్లో 2 ఎకరాల్లో శనగ, ఎకరంలో పొగాకు సాగు చేశాడు. గతేడాది బ్యాంకులో పొలం కాగితాలు, బంగారం కుదువ పెట్టి రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. గ్రామంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3 లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. అప్పులు మరింత భారంగా మారడంతో గురువారం రాత్రి తన భార్యతో అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నానని మనోవేదనకు గురయ్యాడు.

తర్వాత బయటకు వెళ్తున్నాని, తన తల్లి, కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. అలా బయటకు వెళ్లిన రామాంజనేయులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో గ్రామంలో వెతికారు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడులే అనుకుని పడుకున్నారు. తెల్లవారే సరికి గ్రామంలోని తూమాటి ఆంజనేయులు పొలం వద్ద విగత జీవిగా పడి ఉన్నాడు. పక్కనే మోనో క్రోటోఫాస్‌ పురుగుమందు డబ్బా, కిన్లే బిస్లరీ షోడా బాటిల్‌ ఉన్నాయి. భార్య లక్ష్మి, బంధువులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.కోటి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్‌ ఆర్‌.బ్రహ్మయ్య, మండల వ్యవసాయాధికారి పోతినేని వేణుగోపాల్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top