బస్సుబోల్తా.. ఇద్దరి దుర్మరణం     

two Dies In Road Accident - Sakshi

ఐదుగురికి గాయాలు

మృతులు ప్రకాశం జిల్లావాసులు

డ్రైవర్‌ నిద్రమత్తే కారణం

వేములపల్లి (మిర్యాలగూడ) : ప్రైవేట్‌ ట్రావెల్‌బస్సు పల్టీకొట్టి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వేములపల్లి శివారులోని నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఏపీ 04వై 7181లో 28మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి చీరాలకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30గంటలకు బస్సు వేములపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతానికి చేరుకునే సమయంలో డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు.

దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ దిమ్మెలను ఢీకొట్టి రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన యలమల సుబ్బరావమ్మ(55), అదేజిల్లాకు చెందిన మాటూరు మండలం బొబ్బాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లి నాగేశ్వర్‌రావు(31) అక్కడికక్కడే మృతిచెందాడు.

సుబ్బరావమ్మ  హైదరాబాద్‌లోని తన అన్న ఇంటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తోంది. నాగేశ్వర్‌రావు హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుపాటి శ్రీనివాసప్రసాద్, చంద్రవాణి దంపతులు, నర్సరావుపేటకు చెందిన రాగ విజయలక్ష్మీతో పాటు ఆమె కుమారుడు మనీష్‌కార్తీక్‌రెడ్డి, తల్లి గుంటా సుబ్బమ్మకు స్వల్పగాయాలయ్యాయి.

బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మాడ్గులపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్, మిర్యాలగూడ టూటౌన్‌ ఎస్‌ఐ శేఖర్‌ పోలీస్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఐదుగురిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుబ్బరావమ్మ, నాగేశ్వర్‌రావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలానికి చేరుకని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయాణికుడు శ్రీహర్షారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే పరామర్శ..

బస్సు బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన యలమల సుబ్బరావమ్మ, బెల్లి నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భాస్కర్‌రావు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలోని పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను స్వగ్రామానికి తరలిం చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట నా మిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, బాబ య్య, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top