ఇద్దరి ఉసురు తీసిన మద్యం మత్తు

Two Dead In Bike Accident Prakasam - Sakshi

రెండు బైకుల ఢీ.. ఇద్దరు దుర్మరణం

మరో మహిళకు తీవ్ర గాయాలు

ఉల్లగల్లు సమీపంలో ఘటన..

ముండ్లమూరు: మండలంలోని రెడ్డినగర్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమే కారణంగా తెలుస్తోంది.   పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్లగల్లు పంచాయతీ పరిధి రెడ్డినగర్‌కు సమీపంలో అద్దంకి–దర్శి ప్రధాన రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన మేడగం వెంకటేశ్వరరెడ్డి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వరరెడ్డి భార్య తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం గ్రామానికి చెందిన దిగుడు శ్రీనివాసరావు (26) కూడా ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, తిరుపతమ్మ దంపతులు ఉల్లగల్లులో జరుగుతున్న బ్రహ్మంగారి వార్షికోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరారు. మార్కాపురం గ్రామానికి చెందిన దిగుడు శ్రీనివాసరావు ముండ్లమూరు మండలం వేములబండలో ఉంటున్న తన భార్యను చూసేందుకు బయల్దేరాడు.

మార్గమధ్యంలో దర్శిలో మద్యం తాగి వేములబండకు వస్తున్నానని తన మామ యలమందరావుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు.  మార్గమధ్యంలో రెడ్డినగర్‌ వద్ద ఎదురుగా వస్తున్న వెంకటేశ్వరరెడ్డి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో వెంకటేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన భార్య తిరుపతమ్మ భర్త మృతదేహం వద్ద భోరున విలపించింది. శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న అద్దంకి సీఐ హైమారావు క్షతగాత్రులు వ్రీనివాసరావు, తిరుపతమ్మలను ఆటోలో దర్శి వైద్యశాలకు తరలించారు. దర్శికి చేరుకునేలోపు శ్రీనివాసరావు కూడా మృతి చెందాడు. తిరుపతమ్మకు ప్రథమ చికిత్స అనంతరం మురుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు.

శ్రీనివాసరావు చివరి ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు అతడి మామ యలమందరావుకు సమాచారం ఇచ్చారు. దర్శి సీఐ ఎం. శ్రీనివాసరావు, ఎస్‌ఐ శివనాంచారయ్యలు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు శ్రీనివాసరావుకు భార్య అనూష ఉన్నారు. అనూష ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భిణి. మార్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వేములబండకు చెందిన యలమంద కుమార్తెను వివాహం చేసుకొని కొంతకాలంగా వేములబండలోనే ఉంటూ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇక్కడ పని లేకపోవడంతో స్వగ్రామం మార్కాపురంలో ఉంటున్నాడు. భార్యను చూసేందుకు వస్తూ ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మృతి చెందాడని సమాచారం తెలియడంతో అనూష కన్నీరుమన్నీరైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాంచారయ్య తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top