‘మద్యం కేసు’లో వైద్యుడికి వార్నింగ్‌

Traffic Police Warning To Osmania Doctor Hyderabad - Sakshi

నమూనాలు సేకరించకుండానే నివేదిక

మందు తాగలేదంటూ నిర్ధారించిన వైనం

వ్యవహారశైలిని తప్పుపట్టిన విచారణ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌:డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ తనిఖీల్లో చిక్కి, వివాదాస్పదంగా మారిన జహిరుద్దీన్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఉన్నతాధికారులు మందలించారు. రక్త నమూనాలు సేకరించకుండా నివేదిక ఇవ్వడాన్ని తప్పుపడుతూ రెండు రోజుల క్రితం కమిటీ ఇచ్చిన నివేదికతో ఈ చర్య తీసుకున్నారు. సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు గత నెల 25 వతేదీ రాత్రి కాచిగూడలోని ఐనాక్స్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 9.05 గంటల ప్రాంతంలో ఇన్నోవాలో వచ్చిన హాజిపుర వాసి సయ్యద్‌ జహిరుద్దీన్‌ ఖాద్రీని ఆపి బ్రీత్‌ ఎనలైజింగ్‌ పరీక్షలు నిర్వహించగా యంత్రం రీడింగ్‌లో బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ 43గా చూపింది. నిబంధనల ప్రకారం 30 కంటే ఎక్కువ వస్తే అది ఉల్లంఘన కావడంతో ట్రాఫిక్‌ పోలీసులు జహీరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. అయితే తాను మద్యం తాగలేదంటూ వాదించిన ఆయన మరోసారి పరీక్ష చేయమన్నారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం అలా చేయడం కుదరదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. దీంతో జహీరుద్దీన్‌ నేరుగా సుల్తాన్‌బజార్‌ శాంతిభద్రతల విభాగం పోలీసులను  ఆశ్రయించి ట్రాఫిక్‌ పోలీసులపై ఫిర్యాదు చేశారు.

దీంతో విధుల్లో ఉన్న ఎస్సై ఓ కానిస్టేబుల్‌ను ఇచ్చి జహీరుద్దీన్‌ను రాత్రి 11.35 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్స్‌ అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న వైద్యుడు చంద్రశేఖర్‌ జహీరుద్దీన్‌ను క్లినికల్‌ ఎగ్జామ్‌ చేసి (నడక, కళ్ళు, మాటతీరు తదితరాలు పరీశీలించడం ద్వారా) ‘నార్మల్‌’ అని,  జహిరుద్దీన్‌ మద్యం తాగలేదంటూ నివేదిక ఇచ్చారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని జహీరుద్దీన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నగర అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌ సీరియస్‌గా తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బ్రీత్‌ ఎనలైజర్ల విషయంలో వివాదం తలెత్తడంతో ట్రాఫిక్‌ అధికారులు రంగంలోకి దిగారు.

జహీరుద్దీన్‌కు రక్త పరీక్ష చేయకుండా రిపోర్ట్‌ ఇచ్చిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌కు గత నెలలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం రక్త పరీక్షల వ్యవహారంపై డాక్టర్‌ చంద్రశేఖర్‌కు అవగాహన లేని పక్షంలో ఆయన కేసును డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ వద్దకు పంపాల్సి ఉండగా అలా చేయలేదు. దీంతో ఈయనపై విచారణ బాధ్యతలను ఫిజీషియన్, ఫోరెన్సిక్, ఆర్‌ఎంఓలతో కూడిన కమిటీకి అప్పగించారు. విచారణ పూర్తి చేసిన కమిటీ రెండు రోజుల క్రితం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా అన్ని విభాగాల హెడ్‌ఓడీలతో సమావేశమైన సూపరింటెండెంట్‌ తుది నిర్ణయం తీసుకుని డాక్టర్‌ చంద్రశేఖర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఇకపై ఇలాంటి కేసుల్లో కచ్చితంగా రక్తనమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జహీరుద్దీన్‌ తనపై నమోదైన ‘డ్రంక్‌ డ్రైవింగ్‌’ కేసును కోర్టులో ఎదుర్కోవడం అనివార్యంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top