అతడిది ఆదర్శం.. ఆమెది వ్యా‘మోహం’!

Trackmen Srinivas Murder Mystery Reveals - Sakshi

వీడిన ట్రాక్‌మెన్‌ శ్రీనివాస్‌ హత్య మిస్టరీ  

ప్రియుడితో కలిసి దారుణంగా చంపిన భార్య

భర్త నిద్రిస్తుండగా ఎలా చంపాలని సమాలోచనలు

ఇద్దరినీ కటకటాల్లోకి పంపిన సనత్‌నర్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్‌: కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివిన అతడు రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తనకు లేని చదువుకునే అదృష్టం భార్యకైనా దక్కాలని, తద్వారా తన పిల్లల భవిష్యత్‌ బాగుండాలని ఆశించి భ్యార్యను చదివించాడు. భర్త సహకారంతో ప్రస్తుతం బీఈడీ చదువుతున్న ఆ భార్య సమీప బంధువు వ్యామోహంలో పడింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడన్న కోపంతో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. శనివారం సనత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన ట్రాక్‌మెన్‌ ఎం.శ్రీనివాస్‌ హత్య వెనుక ఉన్న మిస్టరీ ఇది. ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ కేసును 48 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ ఎంపిక ప్రక్రియలో ప్రాథమిక పరీక్షల్లో ఆ కి‘లేడీ’ అర్హత సాధించడం కొసమెరుపు. ఈ వివరాలను మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. 

భార్యను చదివించి ఆదర్శంగా నిలిచిన భర్త
రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ 2009లో వరంగల్‌ జిల్లా నెక్కొండకు చెందిన సంగీతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా బోరబండ రైల్వేట్రాక్స్‌ పక్కన ఉండే రైల్వే క్వార్టర్స్‌లో పిల్లలతో నివసిస్తున్నారు. పదో తరగతి మాత్రమే చదువుకున్న శ్రీనివాస్‌.. తన భార్యను ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించాడు. అలాచేస్తే తమతో పాటు తమ పిల్లల భవిష్యత్‌ బాగుంటుందకున్నాడు. దీంతో వివాహమయ్యే నాటికి పదో తరగతి మాత్రమే పూర్తి చేసిన సంగీతను ఇంటర్, డిగ్రీ చదివించాడు. ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో బీఈడీ చేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సై పరీక్షలకు హాజరైన సంగీత ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. తన భార్య త్వరలో ఎస్సై అవుతుందన్న ఆనందం శ్రీనివాస్‌కు ఎక్కువ రోజులు మిగల్లేదు. 

కుమారుడి బర్త్‌డేలో ‘కొత్త పరిచయం’
శ్రీనివాస్‌–సంగీతలు రెండేళ్ల క్రితం తమ చిన్న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేశారు. ఆ కార్యక్రమానికి ఇతర బంధుమిత్రులతో పాటు వికారాబాద్‌ జిల్లా ధరూర్‌కు చెందిన శ్రీనివాస్‌ మేనల్లుడు వి.విజయ్‌నాయక్‌ కూడా వచ్చాడు. ఐటీఐ పూర్తిచేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఇతడికి ఆ పార్టీలో సంగీతతో పరిచయమైంది. 2017లో అతగాడు కొన్నాళ్ల పాటు శ్రీనివాస్‌ ఇంట్లోనే ఉండడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన శ్రీనివాస్‌ ఇద్దరినీ మందలించి విజయ్‌ను తన ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దాంతో విజయ్‌ లాలాగూడలోని తాత వద్ద ఉంటూ క్యాటరింగ్‌ పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ లేని సమయంలో అదును దొరికినప్పుడల్లా బోరబండలో సంగీతను కలుస్తున్నాడు. 

ప్రియుడికి ఉద్యోగం, తనకు స్వేచ్ఛ అని..
ఈ విషయం తెలిసిన శ్రీనివాస్‌ తన భార్యను మందలిస్తూ వచ్చాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా చెప్పడాన్ని ఆమె వేధింపులుగా భావించింది. తన భర్తను అంతం చేస్తే తనకు ప్రియుడితో గడిపే స్వేచ్ఛ, ఐటీఐ చదివిన అతడికి భర్త ఉద్యోగం వస్తాయని, తాము హాయిగా ఉండవచ్చని సంగీత భావించింది. ఎప్పటిలాగే శుక్రవారం శ్రీనివాస్‌–సంగీతల మధ్య గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం మద్యం తాగి వచ్చిన శ్రీనివాస్‌ ఇంట్లో నిద్రపోతున్నాడు. ఆ రోజు భర్తను అంతం చేయాలని భావించిన సంగీత రాత్రి తన ప్రియుడు విజయ్‌కు ఫోన్‌ చేసి రప్పించింది. ఇద్దరూ కలిసి ఇంటి ముందు గదిలో నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను నిశితంగా గమనించారు. అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించి హత్య చేయడానికి ఇదే అదునుగా భావించారు.

రెండు రకాల ఆలోచనలు కాదని..
నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను ఎలా చంపాలనే అంశంపై సంగీత, విజయ్‌ మల్లగుల్లాలు పడ్డారు. తొలుత కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేయాలనుకున్నారు. ఇంట్లో వైర్‌ కోసం వెతుకుతున్న సమయంలో విజయ్‌.. ఇంటికి సరఫరా అయ్యే కరెంట్‌ షాక్‌తో మనిషి వెంటనే చచ్చిపోడని, పదేపదే ఇస్తే అతడికి మెలకువ వచ్చే ప్రమాదం ఉందని చెప్పాడు. దీంతో సంగీత ఫ్యాన్‌కు ఉరివేసి చంపి, ఆత్మహత్యలా చిత్రీకరిద్దామని సూచించింది. అలాచేస్తే శ్రీనివాస్‌ బరువుకు ఫ్యాన్‌ రెక్కలు విరిగి అతడు కింద పడిపోవచ్చని వారించాడు. చివరకు బియ్యం బస్తాల కింద వేసిన గ్రానైట్‌ బండతో తలపై మోది చంపాలని నిర్ణయించుకున్నారు. అతడు అరిచినా చుట్టుపక్కల వారికి వినిపించకుండా ఉండాలని.. రైలు వచ్చే వరకు ఎదురు చూసిన ఇద్దరూ ట్రాక్‌పై అది వెళ్తున్నప్పుడు ఆ శబ్దం ఆగేలోపు శ్రీనివాస్‌ తలపై మోది చంపేశారు. 

ప్రవర్తనపై అనుమానం రావడంతో..
శ్రీనివాస్‌ చనిపోయాడని నిర్థారించుకున్న ఇరువురూ తల నుంచి రక్తం బయటకు రాకుండా దుప్పటి చుట్టారు. మృతదేహాన్ని దోమతెరలో చుట్టేసి తమ ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న రైలు పట్టాల పక్కన పడేశారు. ఈ మృతదేహాన్ని శనివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హతుడి సోదరుడు శంకర్‌ ఫిర్యాదుతో సనత్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. బాలానగర్‌ డీసీపీ పీవీ పద్మజ ఆదేశాల మేరకు ఏసీపీ టి.గోవర్ధన్‌ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి ఇది హత్యగా అనుమానించి లోతుగా దర్యాప్తు చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయపడింది. దీంతో మంగళవారం సంగీత, విజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top