రక్త చరిత్ర!

Three People Assasinated in Tamil nadu With Old factions - Sakshi

భగ్గుమన్న పాతకక్షలు

మహిళతో సహా ముగ్గురు దారుణహత్య

కేరళలో ముగ్గురి అరెస్టు, మరో వ్యక్తి కోసం గాలింపు

హతులు, హంతకులు ఉత్తరాది వాసులే

తమిళనాడు, సేలం: పాత కక్షలు ఉత్తరాది నుంచి తమిళనాడుకు ఓ కుటుంబాన్ని వెంటాడాయి. తమ వాళ్లే అన్న కనికరం  చూపించకుండా ఉత్తరాదికి చెందిన వాళ్లు కిరాతకులయ్యారు. సేలంలో మహిళ సహా ముగ్గుర్ని గొంతు కోసి హతమార్చారు. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేయగా, మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం సమీపంలోని పెరుమాంపట్టి గ్రామానికి చెందిన తంగరాజ్‌ వెండి తయారీ కర్మాగారం నిర్వహిస్తున్నాడు. ఈయన వద్ద ఉత్తరాదికిచెందిన అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రాకు చెందిన ఆకాష్‌ (29) పనిచేస్తున్నాడు. ఈయన భార్య వందనా కుమా రి (25). వీరికి పది నెలల మగ బిడ్డ ఉన్నాడు. వీరితో పాటు ఆకాష్‌ చిన్నాన్న కుమారుడు సన్నికుమార్‌ (15) కూడా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సెలవు కావడంతో ఇంటికే పరిమితమయ్యారు. అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఆకాష్, వంద ఇంటి నుంచి బిడ్డ ఏడుపు శబ్దం చాలేసేపు వినిపించడంతో పక్కన ఉన్న వారు మేల్కొన్నారు. ఇంటిæ తలుపులు తెరిచి చూడగా లోపల వందనా కుమారి గొంతు కోసిన స్థితిలో వంట గదిలో రక్తపు మడుగులో పడిఉంది. ఆందోళనకు లోనయ్యా రు. ఇంటి వెనుక వైపు ఆకాష్, సన్నికుమార్‌ మృత దేహాలు పడి ఉండడంతో ఉత్కంఠ బయలు దేరింది. 

పాత కక్షలతో..
హత్య విషయమై స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పది నెలల బిడ్డను మాత్రం దుండగులు వదలి పెట్టారు. సమాచారం అందుకున్న స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని సేలం జీహెచ్‌కు తరలించారు. డెప్యూటీ కమిషనర్‌ సెంథిల్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో పరిశీలించారు. నలుగురు వ్యక్తలు ఈ హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు. ఆ నలుగుర్ని అక్కడి వారు గుర్తించారు. వీరంతా ఆకాష్‌ స్నేహితులు దినేష్‌ , వినోద్, విజి, సూరజ్‌ అని తేలింది. ఉత్తరాదికి చెందిన వీరంతా గతంలో ఆకాష్‌తో కలిసి పనిచేశారు. స్నేహితుల మధ్య గతంలోనే నగదు పంపిణీ లావాదేవిలకు సంబంధించిన వివాదం ఉన్నట్టు తేలింది.

ఉత్తరాది నుంచే వీరి మధ్య పాత కక్షలు ఉన్నట్టు విచారణలో తేలింది. ఇటీవల ఈ నలుగురు మళ్లీ తంగరాజ్‌ వద్ద పనికి చేరినట్టు సమాచారం. ఆదివారం రాత్రి మద్యం సేవించి వచ్చి ఆకాష్‌తో ఆ నలుగురూ గొడవ పడ్డట్టు వెలుగు చూసింది. పాత కక్షల నేపథ్యంలో కోపోద్రిక్తులైన ఆ నలుగురూ హతమార్చి ఉంటారని భావి స్తున్నారు. పసి బిడ్డ నిద్రిస్తుండడంతో వదలి పెట్టారు. వెంటాడి మరీ గొంతు కోసి హతమార్చినట్టు విచారణలో బయట పడింది. దీంతో ఆ నలుగురి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం కేరళ రాష్ట్రంలోని పాలక్కాడుకులో ఉన్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. ప్రధాన నింధితుడు సూరజ్‌ జాడ కానరాక పోవడంతో అతడి కోసం గాలిస్తున్నారు. కాగా పాత కక్షలతో ఉత్తరాది వాసులే హత్యకు గురికావడం, హంతుకులు అక్కడి వారే కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తరాది వారి వివరాల సేకరణ మీద పోలీసులు దృష్టి పెట్టారు. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డను తమ సంరక్షణలో ప్రస్తుతానికి పోలీసులు ఉంచుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top