దూసుకొచ్చిన మృత్యువు

Three Died in Car Accident Kurnool - Sakshi

బైకును ఢీకొన్న పెళ్లికారు

తండ్రీకుమార్తె మృతి

నిద్రమత్తులో కారు డ్రైవింగ్‌ చేయడంతో దుర్ఘటన

కర్నూలు(హాస్పిటల్‌): ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు వారి పాలిటి మృత్యుశకటమైంది. పెళ్లి కారు ఢీకొనడంతో తండ్రి, కుమార్తె మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన రామమోహన్‌రెడ్డి కుమారుడు గోపాల్‌రెడ్డి(31) నాలుగేళ్ల క్రితం కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన ప్రశాంతిని వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం కర్నూలు నగరంలోని సంతోష్‌నగర్‌ వచ్చి అక్కడే ఆక్వా ప్లాస్టిక్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె పేరు చతురారెడ్డి(3). నాలుగు నెలల క్రితం రెండో కూతురు జన్మించింది. గురువారం రోజే ప్రశాంతి పుట్టింటి నుంచి సంతోష్‌నగర్‌కు బిడ్డతో వచ్చింది. శుక్రవారం సాయంత్రం కూరగాయలు తీసుకు వచ్చేందుకు గోపాల్‌రెడ్డి తన కుమార్తె చతురారెడ్డితో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళ్లాడు. కూరగాయలు తీసుకుని రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరగా ప్రమాదం చోటుచేసుకుంది.

నిద్రమత్తులో ప్రాణం తీశాడు..
హైదరాబాద్‌కు చెందిన సునంత్‌(28) సోదరి వివాహం శుక్రవారం కర్నూలులోని కోల్స్‌ సెంటీనియల్‌ చర్చిలో జరిగింది. సాయంత్రం పెళ్లి తంతు ముగిసిన అనంతరం  సంతోష్‌నగర్‌లోని బంధువుల ఇంటికి పెళ్లి వారు కారులో బయలుదేరారు. పెళ్లి పనుల కారణంగా నాలుగు రోజుల నుంచి సునంత్‌కు నిద్రకరువైంది. దీంతో కారును డ్రైవింగ్‌ చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సమయంలో కారు ఊహించనంత వేగంతో ముందుకు దూసుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు దీనిని గమనించి సునంత్‌ను పలుమార్లు తట్టి లేపసాగారు. వెంకటరమణకాలనీలోకి వెళ్లగానే మళ్లీ నిద్రపోతూనే కారు డ్రైవింగ్‌ చేశాడు. రోడ్డు నంబర్‌ నాలుగు వద్ద ముందుగా వెళ్తున్న గోపాల్‌రెడ్డి బైక్‌ను వేగంగా ఢీకొట్టాడు. వెంటనే ఆ బైక్‌ కాస్తా పక్కనే వెళ్తున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ మధుసూదన్‌ను ఢీకొంది. ఆ తర్వాత పక్కనే ఉన్న కారును ఢీకొనగా, ఆ కారు ముందుగా ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపాల్‌రెడ్డి, చతురారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ప్రమాదంలో కానిస్టేబుల్‌ మధుసూదన్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారును డ్రైవింగ్‌ చేసిన సునంత్‌ను ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top