ఆగిఉన్న లారీ డ్రైవర్లే లక్ష్యం

Thieves are arrested - Sakshi

దొంగల ముఠా అరెస్ట్‌

నార్కట్‌పల్లి-అద్దంకి రోడ్డులో వరుస చోరీలు

నల్లగొండ క్రైం : జల్సాలకు అలవాటుపడి ఆగివున్న లారీడ్రైవర్లను బెదిరించి నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠా సభ్యుల నుంచి రూ.6వేలు, సెల్‌ఫోన్, 5 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా వివరాలను టూటౌన్‌ సీఐ భాష విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  

ముఠా సభ్యులు వీరే..

నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయం సమీపానికి చెందిన పెయింటింగ్‌ పనిచేస్తున్న మైనం నాగార్జున ఆలియాస్‌ రాజు, పాప, గొల్లగూడలోని సాధన హైస్కూల్‌ ప్రాంతానికి చెందిన మొబైల్‌ షాపులో పనిచేస్తున్న గుండగోని ఉదయ్‌కుమార్, ఆలియాస్‌ ఉదయ్, దారుషఫ కాలనీలోని సోనాలిక ట్రాక్టర్‌ షోరూమ్‌ సమీపంలో నివాసముంటున్న విద్యార్థి బొజ్జ అనురాగ్, సతీష్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్న కత్తుల అఖిల్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు.

వీరు చదువు మానేసి వివిధ పనులు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. వీరు గంజాయి అమ్మకం, తాగడం కేసులో గతంలో పట్టుబడ్డారు. వీరంతా కలిసి.. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో తిప్పర్తి నుంచి నార్కట్‌పల్లి మధ్యన నిలిపివేసిన లారీలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆగి ఉన్న లారీ డ్రైవర్‌ వద్దకు ఒకరు వెళ్లి మంచినీళ్లు కావాలని అడిగి లారీలో ఎంతమంది ఉన్నారో గమనిస్తుంటారు. డ్రైవర్, క్లీనర్‌ ఇద్దరు, లేదా ఒక్కరు ఉంటే మిగిలిన వారికి సమాచారం ఇస్తారు.

లారీకి కొద్దిదూరంలో బైకులు ఆపాడం, ఒక్కరే ఉంటే ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చి లారీ వద్దకు రప్పించి డ్రైవర్‌పైన దాడికి దిగుతారు. కత్తితో బెదిరింపులకు పాల్పడి డ్రైవర్, క్లీనర్‌ వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లను చోరీ చేస్తారు. ఇలా రెండు సంవత్సరాల నుంచి ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది.

వెలుగులోకి వచ్చింది ఇలా..

బీహార్‌కు చెందిన రామ్‌నిరంజన్‌సింగ్‌ ఈనెల 12 లారీలో కార్లలోడ్‌తో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తూ ఆర్జాలబావి బతుకమ్మ చెరువు వద్ద ఆపుకుని నిద్రించగా రాత్రి రెండు గంటల సమయంలో ముఠాలోని సభ్యుడైన నాగార్జున డ్రైవర్‌ వద్దకు వెళ్లి తాగునీరు కావాలని అడిగాడు. డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడని గమనించి గుండగోని ఉదయ్‌కుమార్‌తో కలిసి డ్రైవర్‌ను బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచాడు.

డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.15వేలు, ఒక ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌కు గాయాలైనప్పటికీ దుండగులపై ఎదురుదాడి చేయడంతో అక్కడ నుంచి పారిపోయారు. లారీడ్రైవర్‌ బతుకమ్మ చెరువు నుంచి మర్రిగూడ బైపాస్‌ పెట్రోల్‌బంకు వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. బంకులో పనిచేస్తున్న వారు రామ్‌నిరంజన్‌సింగ్‌ను 108లో అంబులెన్స్‌లో ఆస్పత్రికి పం పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే రంగంలో దిగిన సీఐ భాష, రూరల్‌ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలించారు. కత్తిపోట్లకు గురైనప్పుడు వేలిముద్రలను  సేకరించి డ్వాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలను సేకరించారు. అద్దంకి రోడ్డులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా మైనం నా గార్జున, కత్తుల అఖిల్‌ అనుమానస్పదంగా బైక్‌పై కనిపించడంతో విచారించగా ఏడాది నుండి ఐదుసార్లు హైవేపైన బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు పరిశోధనలో ప్రతిభ చూపిన ఐడీపార్టీ్ట సిబ్బంది విష్ణువర్ధన్, లింగస్వామి,  మసూద్‌ను సీఐ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top