కౌలురైతు దారుణ హత్య

Tenant farmer Murdered in Prakasam - Sakshi

సేద్యం చేస్తుండగా పక్క పొలంలో నీరు పడటమే కారణం

త్రిపురాంతకం మండలం రాజుపాలెం పొలాల్లో ఘటన..

 మృతుడు వికలాంగుడు, నిందితులు తండ్రి, కొడుకు

ప్రకాశం, త్రిపురాంతకం: ట్రాక్టర్‌తో పొలం దమ్ము చేస్తుండగా నీరు పక్క చేలో పడటమే ఆ కౌలురైతు చేసిన పాపం. దీనికి పక్క చేనుకు చెందిన తండ్రి, కొడుకు తీవ్ర ఆగ్రహం చెంది కౌలురైతును వెంటబడి మరీ కత్తితో గొంతులో కసితీరా పొడిచి మరీ ఉసురు తీశారు. ఈ సంఘటన మండలంలోని రాజుపాలెంలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కౌలురైతు వల్లెపు ఏడుకొండలు (45)కౌలురైతు. అంతేకాకుండా దివ్యాంగుడు కూడా. తాను కౌలుకు తీసుకున్న రెండెకరాల భూమిలో పైరు వేసేందుకు ట్రాక్టర్‌తో దమ్ము చేసుకుంటున్నాడు. పొలానికి నీరు పెట్టి తడిపే క్రమంలో ఆ నీరు పక్కచేలో పడటం వివాదానికి దారితీసింది. పక్క చేనుకు చెందిన బి.రామాంజి, అతడి కుమారుడు చిరంజీవి కలిసి ఏడుకొండలుతో ఘర్షణకు దిగారు.

వారి మధ్య మాటామాట పెరగడంతో వివాదం హత్యకు దారితీసింది. తండ్రి, కుమారుడి బారి నుంచి రక్షించుకునేందుకు దివ్యాంగుడైన ఏడుకొండలు పక్కనే ఉన్న నేషనల్‌ హైవేపైకి పరుగులు తీశాడు. రామాంజి, చిరంజీవి వెంటాడి పట్టుకుని మెడ భాగంలో కత్తితో పొడవడంతో పాటు శరీరంపైనా కసితీరా పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఏడుకొండలు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు ముందు కూడా వీరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సమయంలో ట్రాక్టర్‌ దమ్ము చేస్తుండగా బురద మట్టిలో ట్రాక్టర్‌ ఇరుక్కుపోయింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ గ్రామంలోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించి ఏడుకొండలును తండ్రి, కొడుకు హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు, నిందితులు బంధువులు కావడం గమనార్హం. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ మారుతీకృష్ణ, ఎస్‌ఐ చంద్రావతిలు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

మృతుడి కుటుంబంలో విషాదం
ఏడుకొండలు హత్యతో ఆయన కుటుంబంతో పాటు బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడుకొండలు దినసరి కూలీ కుటుంబం రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగర్‌ కాలువకు ఈ ఏడాది నీటి సరఫారా చూసి రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు అతడి బంధువులు చెబుతున్నారు. ఇటీవల ఓ పైరు సాగు చేశాడు. పంట కోసిన అనంతరం రెండో పంటను వేసేందుకు తిరిగి భూమి దమ్ము చేసే క్రమంలో హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె, ఒక కుమారుడికి వివాహమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top