గూగుల్‌ సాయంతో గుడిని దోచేశారు!

Temple Robbery With Google Help In Hyderabad - Sakshi

విలువైన వస్తువుల కోసం సెర్చ్‌ చేశారు

అవి పంచలోహ విగ్రహాలేనని గుర్తించారు

గుండేపూడిలోని దేవాలయానికి నావిగేట్‌

అత్యంత విలువైన పురాతనవిగ్రహాల చోరీ

ముగ్గురు దొంగల్ని అరెస్టు చేసిన ఎస్‌ఓటీ

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్లుగా చోరీలు చేస్తున్న ఓ దొంగ ఆ సొత్తును తన సమీప బంధువు ద్వారా విక్రయిస్తున్నాడు... ఈ ‘ఆదాయం’ ఎప్పుడూ వేలు దాటలేదు.దీంతో ఆ సమీప బంధువు ఓ అడుగు ముందుకు వేసి ఆలోచించాడు. ఇంటర్‌నెట్‌లో విలువైన వస్తువుల కోసం వెతికి అవి పంచలోహ విగ్రహాలుగా గుర్తించాడు... మిగిలిన దొంగలతో కలసి గూగుల్‌ సాయంతో గుండేపూడి గుడి దగ్గరకు వెళ్లాడు... అత్యంత విలువైన 12 పురాతన పంచలోహ విగ్రహాలను దోచేశారు.ఈ సొత్తును ఎవరికి అమ్మాలో తెలియక కారులో పెట్టుకుని తిరుగుతూ రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కారని పోలీసు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగ్‌వత్‌ తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందన్నారు. అదనపు డీసీపీ జె.సురేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.  

ఇళ్లల్లో చోరీలు గిట్టుబాటు కావట్లేదని...
యాదాద్రి జిల్లా ఢాకూ తండాకు చెందిన కె.సంతోష్, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్‌కు చెందిన పండిత్‌ సూరజ్‌లు 2014 నుంచి ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. దాదాపు 15 కేసుల్లో నిందితులుగా ఉండి జైలుకు వెళ్లారు. ప్రధానంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని ప్రాంతాలనే టార్గెట్‌ చేస్తున్న ఈ ద్వయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మూడు చోరీలు చేసింది. ఈ సొత్తును సంతోష్‌ తమ గ్రామానికే చెందిన సమీప బంధువు, ప్రస్తుతం సైదాబాద్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న కె.లచ్చిరామ్, చైతన్యపురికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ వి.జాన్‌ల సాయంతో విక్రయిస్తుండేవారు. ఇది వీరికి గిట్టుబాటు కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు.  

గూగుల్‌ చూపిన ‘దారి’లో వెళ్లి...
ఒక్క నేరంతో రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని భావించిన లచ్చిరెడ్డి దాదాపు ప్రతి చోటా అందుబాటులో ఉండే అలాంటి వస్తువులు ఏమిటో తెలుసుకోవాలని భావించాడు. దీనికోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి పంచలోహ విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్, రేటు ఉన్నట్లు గుర్తించాడు. పురాతనమైన దేవాలయాల్లో ఇవి ఎక్కువగా ఉన్నట్లు గూగుల్‌ ద్వారానే తెలుసుకున్నాడు. హైదరాబాద్‌కు చుట్టు పక్కల జిల్లాల్లో, తేలిగ్గా లక్ష్యం చేరుకోగల గుడుల కోసం మళ్లీ నెట్‌లోనే వెతికాడు. ఇలా మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండలం, గుండెపూడిలోని పురాతన రామాలయం ఫొటోలు చూశాడు. గూగుల్‌ నావిగేట్‌ సాయంతో స్వయంగా అక్కడకు వెళ్లిన లచ్చిరామ్‌ రెక్కీ నిర్వహించి ఆ గుడిలో సరైన భద్రత, సీసీ కెమెరాలు లేవని గుర్తించాడు. దీంతో దాన్నే టార్గెట్‌గా చేసుకుని సంతోష్, జాన్‌లతో కలిసి గత నెల 27 అర్థరాత్రి రంగంలోకి దిగాడు.  

కొట్టేసినా కొనేవారు లేకపోవడంతో...
కారులో అక్కడకు వెళ్లిన ఈ త్రయం తమ వద్ద ఉన్న రాడ్డుతో గుడి తలుపులు పగులకొట్టి సీతారామ, లక్ష్మణుల విగ్రహాలతో పాటు మరో 9 చిన్న విగ్రహాలను ఎత్తుకుపోయారు. అయితే వీటిని అమ్మలేకపోయారు. పెద్ద విగ్రహాల విలువ లెక్కింపు కోసం వాటి కింది భాగం నుంచి చిన్న ముక్కలు కోసి తీశారు. ఓ దశలో వాటిని కరిగించి బంగారం వేరు చేసి అమ్ముకోవాలని భావించారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న ముగ్గురు నిందితులూ చేతిలో డబ్బు లేకపోవడంతో ఈ నెల 16న ఆదిభట్లలోనే మరో చోరీకి యత్నించారు. విగ్రహాలను కారులో పెట్టుకుని సంచరిస్తున్న వీరు ఆదిభట్ల పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ టి.రవికుమార్‌ నేతృత్వంలోని బృందానికి చిక్కారు. వీరి నుంచి 12 విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారించగా చోరీల చిట్టా విప్పారు. దీంతో పండిత్‌ సూరజ్‌ను కూడా పట్టుకున్న ఎస్‌ఓటీ రూ.5.8 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.  

ఆ గుడిలో చోరీ...నాలుగో సారి!
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండలం, గుండెపూడిలోని సీతారామచంద్ర ఆలయానికి అంత ప్రాచుర్యం లేదు. అయినా 23 ఏళ్లల్లో నాలుగుసార్లు దొంగలు పడ్డారు. ప్రతిసారీ ప్రధానంగా విగ్రహాలనే పట్టుకుపోయారు. మొదటి నేరం ఇప్పటికీ కొలిక్కి రాకపోగా... మిగిలిన రెండింటిలోనూ దొంగలు బయటి జిల్లాల పోలీసులకే చిక్కారు. తాజాగా గత నెల 27 అర్ధరాత్రి ఈ దేవాలయాన్ని కొల్లగొట్టిన ‘గూగుల్‌ చోరుల్ని’ రాచకొండ పరిధిలోని ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.  

బయటి ప్రపంచానికి తెలియకున్నా...
అత్యంత పురాతనమైన ఈ రామాలయానికి సంబంధించిన విషయాలు ఆ ఊరి వారికి మినహా బయట ఎవ్వరికీ పెద్దగా తెలీదు. అందులో ఉండే మూడు ప్రధాన, మరో 9 ఇతర, ఉత్సవ విగ్రహాలు కాకతీయుల కాలానికి చెందినవిగా గ్రామస్తులు చెబుతుంటారు. వీటి అసలు వయస్సు ఇప్పటి వరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. తాజా దొంగతనం తర్వాత వీటిని పట్టుకున్న రాచకొండ అధికారులు పురావస్తు శాఖ ద్వారా ఆ పని చేయించాలని భావిస్తున్నారు. ఈ గుడికి పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాలతో పాటు కనీసం చిన్న లాకర్‌ కూడా లేదు. దీంతో విగ్రహాలను గుడిలో ఉంచి కేవలం చిన్న తాళం మాత్రమే వేస్తుంటారు. ఇదే ‘గూగుల్‌ గాళ్ల’కే కాదు... అనేక సందర్భాల్లో చోరులకు కలిసి వచ్చింది.  

పది... ఏడు... ఆరు...!
ఈ దేవాలయంలో జరిగిన నాలుగు చోరీల మధ్య పది, ఏడు, ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. మొదటి దొంగతనం 1995లో జరిగింది. అప్పట్లో గుడిని కొల్లగొట్టిన దొంగలు కొన్ని విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రతిమలు ఇంకా లభించలేదు. ఆపై రెండోసారి 2005లో, మూడోసారి 2012లో జరిగింది. గుండెపూడి ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్నా విభజనకు ముందు అది వరంగల్‌లోని భాగం. అయితే ఈ రెండు కేసులను మిర్యాలగూడ, నల్లగొండ పోలీసుల ఛేదించి దొంగలను పట్టుకోవడంతో పాటు విగ్రహాలు స్వా«ధీనం చేసుకున్నారు. మళ్లీ గత నెలలో గూగుల్‌ సాయంతో రంగంలోకి దిగిన లచ్చిరామ్, సంతోష్, జాన్‌ పురాతన విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఈ త్రయాన్ని ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ అధికారులు పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top