మృత్యువే గెలిచింది..

Teacher Died In Road Accident Karimnagar - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడి 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువకుడు ఓడిపోయాడు. రూ.12లక్షలు ఖర్చుచేసి వైద్యం అందించినా ప్రాణాలు దక్కలేదు. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్న అతని మరణంతో భార్య, ఇద్దరు చిన్నారులు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు స్పందించి మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వపరంగా రూ.4లక్షల సాయం అందించినా ఫలితం దక్కలేదు. ఈ విషాద సంఘటన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సుమన్‌(29) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 9న విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రిపూట ఘటన జరగడంతో తెల్లవారే దాక అక్కడే పడి ఉన్నాడు.

ఉదయాన్నే అటుగా వెళ్తున్న ప్రయాణికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 10న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సుమన్‌కు వైద్య ఖర్చులకోసం ఆయన పనిచేసే ప్రైవేటు పాఠశాలలో రూ.3లక్షలు, కేటీఆర్‌ రూ.4లక్షల సాయం అందించారు. కుటుంబ సభ్యులు మరో రూ.5లక్షలు అప్పులు చేసి మొత్తం రూ.12లక్షలతో వైద్యం అందించిన ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో భార్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య రజిత, కూతురు లహరిక, కుమారుడు దేవాన్స్, తల్లిదండ్రులు రామయ్య,లక్ష్మి ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top