టీడీపీ అనుచరగణం అరాచకం

TDP Local Leader Arrested For Illegal Activities In Narasaraopet - Sakshi

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ‘తమ్ముళ్ల’ అక్రమాలు

పోలీసుల అదుపులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి

సాక్షి, నరసరావుపేట (గుంటూరు) : అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల అక్రమాల పుట్ట పగులుతోంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడి అవినీతిని ఆదర్శంగా తీసుకున్న తమ్ముళ్లు గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు తెగబడ్డారు. ప్రభుత్వం మారటంతో బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తుండటంతో వారి అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. నష్టపోయిన  బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధితో పాటు ఇద్దరు మాజీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్నారు. 

అనేక మోసాలు:
అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయ విజయలక్ష్మికి చెప్పి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి ఆంజనేయులు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల్లో ఒకరు ఆళ్ల శేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు నెల రోజుల కిందట చీటింగ్‌ కేసు నమోదు చేశారు. దీంతో పాటు కోడెల కుమారుడు శివరామ్‌కు కే ట్యాక్స్‌ చెల్లించాలని దివ్యాంగుడైన కృష్ణారావును బెదిరించి ఖాళీ స్టాంప్‌ పేపర్ల మీద సంతకాలు చేయించిన అభియోగంపై రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కొల్లి ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కొల్లి ఆంజనేయులును శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

భూముల కబ్జా..
అదే విధంగా గుంటూరు రోడ్డులో ఉన్న తన పొలాన్ని కోడెల శివరామ్‌ అండదండలతో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ కొవ్వూరి బాబు కబ్జాకు పాల్పడ్డాడని చిరుమామిళ్ల బసవయ్య ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కొవ్వూరు బాబు జమిందార్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదుట గతంలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాల కొనుగోలుకు సంబంధించి లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌లు తీసుకొని, దుకాణాలు తమకు ఇవ్వకుండా ఇతరులకు విక్రయించి మోసం చేశాడని బాధితులు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

అలాగే నమ్మకంగా వ్యాపారం చేస్తూ వ్యాపారులు, ఖాతాదారుల నుంచి సుమారు రూ.8 కోట్ల నగదు, బంగారం అప్పుగా తీసుకొని బంగారు వ్యాపారి మారం శ్రీనివాసరావు కుటుంబంతో సహా సుమారు 30 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నష్టపోయిన బాధితులు సుమారు 80 మంది డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కాల్‌ లిస్ట్‌ వివరాలను పరిశీలించగా, టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలియవచ్చింది. కాగా మాజీ స్పీకర్‌ కోడెల కుమారుడు, కుమార్తె, వారి అనుచరగణం చేసిన అవినీతి, అక్రమ దందాలపై బాధితుల ఫిర్యాదుతో పలు స్టేషన్‌లలో కేసులు నమోదవ్వగా, వారంతా పరారీలో ఉండి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top