వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు

TDP Leaders Attacks on YSRCP Sympathisers - Sakshi

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం

జంగమహేశ్వరపురంలో ఒంటరి మహిళలపై విచక్షణారహితంగా దాడి

మిట్టగుడిపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను కాళ్లతో తన్నిన వైనం

మహిళలు పోలీసుస్టేషన్‌కి వెళితే నిందితులకు వంతపాడిన పోలీసులు

రూ. 1,500 తీసుకొని వెళ్లిపోవాలని హెచ్చరిక

బాధితులకు అండగా నిలబడిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు

ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు  

జంగమహేశ్వరపురం(గురజాల రూరల్‌)/రెంటచింతల(మాచర్ల): వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే అక్కసుతో గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వితంతు, ఒంటరి మహిళలపై, వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై భౌతిక దాడులు చేశారు. బాధితుల కథనం మేరకు.. గురజాల మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామం ఎస్టీ కాలనీలో ఒంటరి మహిళలైన చేకూరి మేరీ, ఈగ శివపార్వతి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులయ్యారు. ఇటీవల కాలంలో వైఎస్‌ జగన్‌ పిడుగురాళ్లలో నిర్వహించిన ప్రచార సభకు ఎస్టీ కాలనీ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వారితోపాటు మేరి, శివపార్వతి కూడా వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారు.

ఈ నేపథ్యంలో వారిపై కోపం పెంచుకున్న టీడీపీ వర్గీయులు నాగలక్ష్మి, వెంకటమ్మ, పెద్దిరాజు, సత్యనారాయణ, శివ తదితరులు శుక్రవారం రాత్రి మేరి, శివపార్వతిలను కులం పేరుతో రాయలేని విధంగా దూషించి కర్రలతో, రాళ్లతో, చేతులతో దాడిచేసి ముఖంపై, చేతులపై గాయపర్చారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కితే పోలీసులు టీడీపీ నేతలకు వంతపాడారు. ‘రాజీచేస్తాం.. కేసు లేకుండా రూ. 1,500 తీసుకొని ఆస్పత్రికి వెళ్లండ’ని హెచ్చరించారు. దీంతో చేసేదిలేక మహిళలు ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మహిళలకు అండగా నిలబడడంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్‌పీ శ్రీహరిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారని ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌ఓ వాసు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. 

కాళ్లతో తన్నిన టీడీపీ నేతలు.. 
రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మంచి లక్ష్మీనారాయణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శనివారం దాడి చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. పొలం వెళ్లి ఇంటికి వస్తున్న లక్ష్మీనారాయణను గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, నాయకులు చపారపు అంకిరెడ్డి, గొట్టం అచ్చిరెడ్డి అడ్డగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదని దూషిస్తూ కొట్టారు. అనారోగ్యానికి గురైన తాను పది రోజులుగా ఇంటిలోనే ఉన్నానని, ఈ రోజే బయటకు రాగా టీడీపీ నాయకులు ముగ్గురు కలిసి కాళ్లతో తన్నారంటూ లక్ష్మీనారాయణ వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. త్వరలోనే ఈ రాక్షస పాలనకు తెరపడుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top