వెంచర్‌ నిర్వాహకులపై టీడీపీ నేతల దాడి

TDP Leaders Attack On Venture Managers In Guntur District - Sakshi

సాక్షి, కంతేరు(తాడికొండ):  ప్రైవేటు వెంచర్‌ నిర్వాహకులపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన తాడికొండ మండలం కంతేరు శివారు కండ్రిక చెరువు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేటు వెంచర్‌కు నల్లమట్టిని తరలించేందుకు కండ్రిక చెరువులో ప్రొక్లెయిన్, ఆరు ట్రాక్టర్లు చేరుకొని శనివారం రాత్రి తవ్వకాలు ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న కంతేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ భర్త తోకల నాగభూషణంతో పాటు అతని అనుచరులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాహనాలను అడ్డగించి ఆరు ట్రాక్టర్లతో పాటు డ్రైవర్లు, వెంచర్‌ సూపర్‌వైజర్‌ను పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి నిర్భందించారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన నాయకులే మట్టిని తరలించారని చెప్పాలంటూ ఫోన్‌లలో వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఆ వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తూ వికృతంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై 100 నంబరుకు ఫోన్‌ వెళ్లడంతో స్పందించిన పోలీసులు వెంటనే కంతేరు గ్రామానికి చేరుకొని నిర్బంధంలో ఉన్న వ్యక్తులను విడిపించి ఠాణాకు తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఆరు ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్‌లను సీజ్‌ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అక్రమంగా నిర్బంధించి ట్రాక్టరు డ్రైవర్లు, వెంచర్‌ సూపర్‌ వైజర్‌ను కొట్టిన ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సర్పంచ్‌ భర్త తోకల నాగభూషణం, కర్రి పాల్‌బాబు, తిరుమలరావు, బండారు కోటేశ్వరరావు, జెట్టి తిరుమలరావు మరి కొంతమందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు.

వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు
తాడికొండ:  కంతేరు గ్రామంలో జరిగిన మైనింగ్‌ వ్యవహారంలో ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్‌ సూపర్‌ వైజర్‌ను టీడీపీ నాయకులు నిర్బంధించి వైఎస్సార్‌ సీపీ నాయకులే మట్టి తవ్వకాలు చేశారని చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన వీడియోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన ఘటనపై వైఎస్సార్‌ సీపీ తాడికొండ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎస్‌ఐ సీహెచ్‌.రాజశేఖర్‌కు చూపించారు. తనకు, పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేసిన కంతేరు గ్రామ టీడీపీ నాయకులు జెట్టి తిరుమలరావు, బండారు కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top