‘సన్‌పరివార్‌’.. నిజాలు తేలేనా..?

Sun Pariwar Issue Again Raised In Sangareddy - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధిక వడ్డీ, ఇతర ప్రలోభాలను ఎరగా వేసి జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ‘సన్‌ పరివార్‌’ అనే సంస్థ సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన వైనంపై ‘సాక్షి’ గతంలో వరుస కథనాలు ప్రచురించింది. సంస్థ నిర్వాహకులపై సంగారెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో విచారణ బాధ్యత సీసీఎస్‌కు అప్పగించారు. అయితే సంస్థ లావాదేవీలను పరిశీలించిన జిల్లా సహకార శాఖ అంతా సక్రమంగానే ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. అయితే తాజాగా మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేటలో సన్‌పరివార్‌లో కీలక వ్యక్తి అరెస్టుపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సంగారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని సన్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (సన్‌ పరివార్‌) వ్యవహారం మరోమారు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డిపాజిట్లపై అధిక వడ్డీ, బోనస్, ఇతర ప్రయోజనాలు చేకూరుస్తామంటూ, వందల మంది సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

సన్‌ పరివార్‌ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ ఏడాది మే 22న సంగారెడ్డి రూరల్‌ పోలీసులు  ఐపీసీ సెక్షన్‌ 420, 120బీతో పాటు ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999లోని 3, 5 నిబంధనల కింద 85/2018 నంబరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కలెక్టరేట్‌ సమీపంలోని ఓ భవనంలో ఏర్పాటు చేసిన ‘సన్‌ పరివార్‌’ వెనుక మెతుకు రవీందర్‌ అనే వ్యక్తి అనధికారికంగా కీలక పాత్ర పోషిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 12 మంది డైరక్టర్లతో కూడిన సన్‌ పరివార్‌ సంస్థ వడ్డీ, బోనస్‌ పేరిట 84 మంది సభ్యుల నుంచి లక్ష రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు మొత్తంగా, రూ.8 కోట్ల మేర వసూలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. కోట్లాది రూపాయల వసూలుకు సంబంధించిన వ్యవహారం కావడంతో విచారణ బాధ్యతను సంగారెడ్డి సీసీఎస్‌ విభాగానికి అప్పగించారు. మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీగా నమోదు కావడంతో సంస్థ ఆర్దిక లావాదేవీలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా సహకార అధికారిని కోరుతూ సీసీఎస్‌ పోలీసులు ఈ ఏడాది జూన్‌ 15న జిల్లా సహకార అధికారికి లేఖ రాశారు.

సహకార శాఖ నివేదికలో క్లీన్‌ చిట్‌..
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సన్‌ పరివార్‌’ సంస్థను 1995 నాటి మాక్స్‌ చట్టం నిబంధనల మేరకు 2015 జనవరి 27న రిజిస్టర్‌ చేశారు. 11 మందిని చీఫ్‌ ప్రమోటర్లుగా పేర్కొంటూ.. 2015, 2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ నివేదికలు జిల్లా సహకార అధికారికి సమర్పించారు. అయితే 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో సన్‌ ఆర్దిక లావాదేవీలు భారీగా పుంజుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే డిపాజిట్‌దారులకు జారీ చేసిన బాండ్లపై అధిక వడ్డీ ప్రస్తావన లేకుండా, చట్టబద్దమైన వడ్డీ 9శాతాన్ని ప్రస్తావించారు. సంస్థ ఆడిట్‌ నివేదికలను పరిశీలించిన జిల్లా సహకార అధికారి సీసీఎస్‌ పోలీసులకు సుమారు రెండు నెలల క్రితం నివేదిక అందించారు.

ఈ నివేదికలో అభ్యంతరాలు లేకపోవడంతో చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేటలో ఇటీవల మెతుకు రవీందర్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అరెస్టు చేయడంతో సన్‌పరివార్‌ వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని తాజాగా విద్యా శాఖ సస్పెండ్‌ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఇప్పటి వరకు స్థానికంగా ఎవరూ తమను సంప్రదించలేదని పోలీసులు చెబుతున్నాయి. మరోవైపు కొందరు డిపాజిట్‌దారులు మీడియా సమావేశం పెట్టి తమకు అన్యాయం జరగలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top