పర్యాటక కేంద్రంలో ఆత్మహత్యలు

Suicides in Kailasagiri Tourist Place Visakhapatnam - Sakshi

కైలాసగిరిపై వారం వ్యవధిలో రెండు ఘటనలు

ఆందోళన చెందుతున్న పర్యాటకులు

ఆరిలోవ(విశాఖ తూర్పు): నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. గడిచిన వారం రోజుల్లోనే రెండు ఆత్మహత్యలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడకు వస్తున్న సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. కొండపైకి ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రవేశం కల్పించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, మినీ బస్‌లతోపాటు సిటీ బస్‌లు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉంది. మరో రెండుచోట్ల అప్పూఘర్, హనుమంతువాక వద్ద కాలినడక కోసం మెట్ల మార్గాలున్నాయి. ఇది కొండ ప్రాంతం కావడంతో దట్టమైన ఆడవిని తలపిస్తోంది. దీనిపై ముళ్ల పొదులు, పెద్ద చెట్లు ఉన్నాయి. సందర్శకులు సేద తీరడానికి పార్కులున్నాయి. ఇదిలా ఉండగా కొండపై విశాలమైన ప్రాంతంలో దట్టమైన పొదలుతోపాటు నిర్మానుష్యమైన ప్రదేశాలున్నాయి. ఈ స్థలాలు ప్రేమికులు గడపడానికి నిలయాలగా మారాయి. కొండపై క్యాంటీన్‌ వెనుక భాగం, తెలుగు మ్యూజియానికి వెళ్లే రోడ్డుకు ఇరుపక్కలా ముళ్ల తుప్పలు, రోడ్డు మార్గంలో తెన్నేటి పార్కువైపు ఉన్న సముద్రం వ్యూ ప్రాంతం, హనుమంతువాక మెట్లు మార్గం మధ్యలో దట్టమైన పొదలు వారికి అడ్డాగా మారాయి.

కలత చెంది... కొండపైకి చేరి
కుటుంబ కలహాలున్న వారు, ప్రేమ విఫలమైన వారు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వారిలో ప్రేమికుడు సత్యనారాయణ మృతిచెందగా, ప్రేమికురాలు కమల ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. వారం రోజుల క్రితం రోడ్డు మార్గంలో కొండపై సన్నని దారిలో గుర్తు తెలియన ఓ వ్యక్తి మృతదేహం బటయపడిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి సుమారు నెల రోజుల క్రితం చెట్టుకు లుంగీకట్టి ఆత్మహత్య చేసుకొన్నాడు. చెట్లు, పొదలు కావడంతో ఎవ్వరూ దీన్ని గమనించలేకపోయారు. నెల రోజుల తర్వాత తల, మొండెం వేరయ్యాయి. ఆ తలను కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకురావడంతో విషయం వెలుగుచూసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఈ కొండపై ఓ వ్యక్తి ముళ్ల తుప్పల మధ్యలో చిన్న చెట్టు కొమ్మకు ఉరి వేసుకొన్నాడు. నగరానికి ఆణిముత్యంగా నిలిచిన పర్యాటక కేంద్రమైన ఇక్కడకు విదేశీయులు సైతం వస్తుండటం విశేషం. ఇలాంటి సంఘటనలతో ఇక్కడకు వస్తున్న సందర్శకులు బెంబేలెత్తిపోతున్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top