తహసీల్దార్‌ కారు ఢీకొని ఉపసర్పంచ్‌ దుర్మరణం

sub sarpanch dead in thahasildar car accident - Sakshi

రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై ఘటన

తహసీల్దార్‌ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

కరకట్టపై ఆందోళన

కృష్ణాజిల్లా ,తోట్లవల్లూరు: తహసీల్దార్‌ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఉపసర్పంచ్‌ దుర్మరణం పాలైన సంఘటన రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రొయ్యూరు కొత్తదళితవాడకు చెందిన  గ్రామ ఉపసర్పంచ్‌ పల్లికొండ రాజు (45) కరకట్టపై ఉన్న మేరీమాత విగ్రహం సమీపంలో ట్రాక్టరుకు మరమ్మతులు చేయిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం కారు ఢీకొని మృత్యువాతపడ్డారు. మృతునికి భార్య రజని, కుమార్తె ఉన్నారు. అవనిగడ్డ వైపు నుంచి విజయవాడ వెళుతున్న చల్లపల్లి తహసీల్దార్‌ కారు వేగంగా దూసుకెళ్లి రాజును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎడమవైపు వెళ్లాల్సిన కారు అతివేగంగా కుడివైపునకు దూసుకు రావడంతో రోడ్డు పక్కన నిలుచున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టి ప్రాణాలు కబళించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగ్గానే కారులో ప్రయాణిస్తున్న చల్లపల్లి తహసీల్దార్‌ బి.భిక్షారావు, సిబ్బంది విజయవాడలో కలెక్టర్‌ మీటింగ్‌ ఉందంటూ హడావుడిగా వేరే వాహనంలో వెళ్లిపోవటం పట్ల  గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

కనీస సానుభూతి కూడా లేకుండా ఎలా వెళతారంటూ, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కరకట్టపై స్థానికులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రెవెన్యూ వర్గాల నుంచి హామీ రావడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మృతుని కుటుంబాన్ని ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, సర్పంచి లుక్కా సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మూడే శివశంకర్, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్ల రామచంద్రరావు, వల్లూరుపాలెం మాజీ సర్పంచి చెన్నుపాటి పూర్ణచంద్రరావు, పాములలంక సర్పంచి పాముల శ్రీనివాసరావు తదితరులు పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉయ్యూరు సీఐ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఉయ్యూరు టౌన్, తోట్లవల్లూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top