విద్యార్థినికి ఉపాధ్యాయుడి చెత్త సలహా..దీంతో..

Student Takes Pesticide Over Teachers Advice To Skip SSC Exams - Sakshi

ముంబై : పదవ తరగతి పరీక్షలు తప్పించుకోవటానికి ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన చెత్త సలహా విద్యార్థిని ప్రాణాలు బలితీసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని కురుంద్వాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురుంద్వాడలోని భైరేవాడికి చెందిన నిలేశ్‌ బాలు పరధానే అనే వ్యక్తి శృతి గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పదవ తరగతి పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ అవ్వని సానిక మాలి అనే విద్యార్థిని పరీక్షలను తప్పించుకోవటానికి ఏం చేయాలంటూ నిలేశ్‌ను సలహా అడిగింది. అప్పుడతడు ఆమెకు ఓ చెత్త సలహా ఇచ్చాడు. కొద్దిగా పురుగులమందు తాగమని, అలా చేస్తే స్పృహ కోల్పోయి పరీక్ష హాలు నుంచి నేరుగా ఆసుపత్రిలో చేరవచ్చని చెప్పాడు. స్వయంగా అతడే పురుగుల మందు తెచ్చిచ్చాడు.

దీంతో సదరు విద్యార్థిని ఉపాధ్యాయుడు తెచ్చిఇచ్చిన మందులో నీళ్లు కలుపుకుని తాగింది. అయితే అంచనాలు తారుమారై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 25న సానిక మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లోని విద్యార్థులను, టీచర్లను, ఇతర స్టాఫ్‌ను విచారించి నిలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సానిక కోరిక మేరకే తాను పురుగుల మందు ఇచ్చినట్లు అతడు ఒప్పుకున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top