ప్రాణం బలిగొన్న జాలీ రైడ్‌

Student Died in Bike Accident Anantapur - Sakshi

అమ్మమ్మను చూసేందుకు స్నేహితులతో కలిసి బయలుదేరిన విద్యార్థి

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

అదుపుతప్పి మరో బైక్‌ను ఢీకొని ప్రమాదం

ఘటనాస్థలంలోనే విద్యార్థి దుర్మరణం

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

అనంతపురం , తాడిపత్రి అర్బన్‌/నార్పల: జాలీ రైడ్‌ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అమ్మమ్మను చూసొస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి స్నేహితులతో కలిసి బైక్‌పై బయలుదేరిన విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని సాయి సిద్ధార్థ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూస మురళీకృష్ణ (16), మహమ్మద్‌ ఖాసీం, షాషావలీ స్నేహితులు. కళాశాలలో చేరిన తర్వాత వీరికి ప్రొద్దూటూరులో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం విద్యార్థి హాజీపీరాతో పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం ద్విచక్ర వాహనాలపై జాలీ రైడ్‌కు స్నేహితులు సిద్ధమయ్యారు. ఈ విషయం ఇంటిలో వారికి తెలిస్తే పంపరనే భయంతో.. ధర్మవరానికి స్నేహితులు కారులో వెళుతున్నారని, తాను కూడా వారితో కలిసి వెళ్లి అక్కడున్న అమ్మమ్మను చూసి తిరిగి వస్తానంటూ మురళీ కృష్ణ తన తల్లిదండ్రులను నమ్మించి బయలుదేరాడు. అయితే కారులో కాకుండా రెండు ద్విచక్ర వాహనాల్లో స్నేహితులు గురువారం ఉదయం బయలుదేరారు. 

వేగాన్ని నియంత్రించుకోలేక..  
జాతీయ రహదారిపై రయ్యిమంటూ బైక్‌లను దూకిస్తూ స్నేహితులు జాలీగా ముందుకు సాగారు. ముచ్చుకోట దాటిన తర్వాత నార్పల మండలం మద్దలపల్లి గ్రామ శివారులో మలుపు వద్దకు చేరుకోగానే వాహనాల వేగాన్ని వారు నియంత్రించుకోలేకపోయారు. దీంతో మురళీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొని.. అదే వేగంతో పక్కనే ఉన్న స్నేహితుల మరో వాహనాన్ని ఢీకొంది. ఘటనలో కిందపడ్డ మురళీకృష్ణకు తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందాడు. హాజీపీరాకు కాలు విరిగింది. మహమ్మద్‌ ఖాసీం, షాషావలీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రలను 108 వాహనంలో జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఘటనపై నార్పలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఒక్కడే కుమారుడు..
తాడిపత్రిలో బియ్యం వ్యాపారం చేసుకుని జీవనం సాగించే రమేష్‌ మంజుల దంపతులకు మురళీకృష్ణ ఒక్కడే కుమారుడు, కారులో తన అమ్మమ్మను చూసి వస్తానంటూ ధర్మవరానికి ప్రయాణమై బయలుదేరాడని, అయితే ఇలా తిరిగి రాని లోకాలకు వెళతాడని తాము ఏనాడూ అనుకోలేదంటూ తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మురళీకృష్ణ మృతిచెందినట్లు తెలుసుకున్న కళాశాల యాజమాన్యం గురువారం సెలవు ప్రకటించింది. దీంతో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని తమ మిత్రుడిని కడసారి చూసి, కన్నీటి నివాళులర్పించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top