ఒక్క క్షణం..

special story on suicides - Sakshi

ఆలోచించండి.. జీవించండి

జీవితాన్ని కబళిస్తున్న అనాలోచిత నిర్ణయాలు

వ్యవస్థకు సమస్యగా మారుతున్న ఆత్మహత్యలు

విశాఖ సిటీ: సమస్యకు పరిష్కారం చావే అయితే.. నేను ఎన్నిసార్లు చావాలో... అ న్నారో కవి. ఆత్మహత్య సమస్యకు శాశ్వత పరిష్కారమని భావిస్తూ.. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ప్రాణాలను బలితీసుకుంటున్నారు. జీవితంలో సర్వం కోల్పోయినా ఇంకా భవిష్యత్తు మిగిలి ఉంటుందనే ఆలో చన చేయకుండానే ఆత్మహత్యలకు పాల్ప డుతున్న ఘటనలు కలిచివేస్తున్నాయి. ఒక్క క్షణం ఆలోచిస్తే.. భవిష్యత్‌ తీర్చిదిద్దుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే విషయాన్ని మరిచిపోతున్నారు.

ఇటీవల ఆరిలోవ ముస్తఫానగర్‌లో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన నగరాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. కష్టం ఏదైనా ఆత్మహత్య చేసుకున్నంత కష్టం కాదనే విషయాన్ని గ్రహించక వందేళ్ల జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలుకుతున్న ఘటనలు నగరంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.
జీవితంలో వెనక్కు తీసుకోలేనివి రెం డే రెండు.. ఒకటి కాలం, మరొకటి ప్రాణం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి కోల్పోయినా తిరిగి దక్కించుకోలేం. ఒక్క క్షణంలో వచ్చే క్షణికావేశాన్ని అణచుకునే శక్తి కూడగట్టుకుంటే ప్రాణం దక్కించుకోవచ్చు. కానీ.. అదే లోపిస్తోంది. కోపం, మనస్తాపం, సమస్యలను అధిగమించలేమన్న ఆత్మన్యూనతా భావం ఇవన్నీ.. మనిషిని అంధకారంలో నెట్టేస్తున్నా యి. బలవన్మరణానికి పురి గొల్పుతున్నాయి. ఈ కారణంగానే ఆత్మహత్య అనే ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు కూడగట్టుకునే ధైర్యంలో కేవలం 5 శాతం సమస్య పరిష్కరించేందుకు ఉపయోగిస్తే జీవితం బాగుం టుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

బలవన్మరణంపై యుద్ధం చేద్దాం..
మరణాన్ని జయిద్దాం.. ఈ మాట బతుకు పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదిరించే ధైర్యాన్నిస్తుంది. చావు ఆలోచనలను చావు దెబ్బ తీసేంత వరకూ పోరాడే శక్తిని స్తుం ది. ఆత్మహత్య అనేది వ్యక్తి సమస్యగా కాదు.. వ్యవస్థ సమస్యగా మారుతోంది. ఆత్మహత్యల సంఖ్య పెరగడం.. సమాజా న్ని కలవరపెడుతోంది. నా చావుకు ఎవ రూ కారణం కాదు అనే మాటలోనే అనేక కా రణాలున్నాయని చెప్పకనే చెబుతోంది. ఇందులో సమాజమే ప్రథమ ముద్దాయిగా పరిగణించవచ్చు. నగరంలో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాది నగరంలో 38 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. 18 మందిపై ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి.

ముందే గుర్తించవచ్చు
ఆత్మహత్యలకు పాల్పడే వారిలో 70 శాతం మందిని ముందే గుర్తించవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, స్నేహితులు  సదరు వ్యక్తులపై దృష్టి సారిస్తే సరిపోతుంది. మాటలు, చేష్టలు, వారి రాత ద్వారా గుర్తించవచ్చని చెబుతున్నారు. వారి మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తుంటారు. ఏ పనిమీదా ఆసక్తి చూపించకపోవడం, చేసే పనిమీద ఏకాగ్రత లేకపోవడం, ప్రతి చిన్న విషయానికీ ఆగ్రహం చెందుతుండటం, కుటుంబ సభ్యులు, స్నేహితులపై తరచూ అసహనం వ్యక్తం చేస్తూ ఒంటరిగా గడిపేందుకు ప్రయత్నిస్తున్న వారిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఉప్పులూరి నాగేశ్వరరావు (37) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాగుడుకు బానిసైన నాగేశ్వరరావు మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. తీసుకువచ్చిన జీతం పూర్తిగా తాగుడుకు వినియోగించడంతో పాటు తెలిసిన వారి వద్ద డబ్బులు తీసుకునేవాడు. భర్త సంపాదన చాలకపోవడంతో భార్య ఇంటి వద్దనే దుస్తులు ఇస్త్రీ చేసి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న కొడుకు, ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. కాగా.. శుక్రవారం మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అలిగిన నాగేశ్వరరావు భార్య ఇస్త్రీ పనిలో ఉండగా.. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. కొంత సమయం గడిచిన తరువాత అతని కుమార్తె తలుపులు గడియపెట్టి ఉండడాన్ని గమనించింది. కిటికీలో నుంచి చూడగా తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లికి విషయాన్ని తెలిపింది. ఆ ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవరు విషయం తెలుసుకుని బలంగా తలుపులు నెట్టి లోనికి వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న నాగేశ్వరరావును కేజీహెచ్‌కు తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు మార్గమధ్యలోనే మరణించాడని ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మస్థైర్యం పెంపొందించుకునే శక్తి కావాలి
చాలా మంది కష్ట నష్టాలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటారని చెబుతుంటారు. ఇందులో చాలా వరకూ వాస్తవానికి దూరంగా ఉంటాయి. శాస్త్రపరంగా చూసుకుంటే కొంతమంది మాత్రమే ఆ విధమైన భావాలకు లోనవుతుంటారు తప్ప అందరూ కారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలంటే సంక్లిష్టమైన పరిస్థితిగా భావించవచ్చు. శాస్త్ర పరంగా చూస్తే ఇలాంటి భావాలతో ఉండే వారిలో మెదడు తాలుక నిర్మాణం, సాంఘిక, మానసిక పరిస్థితులుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాం. సమస్యను వ్యక్తిగతంగా తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఈ బలవన్మరణానికి పాల్పడుతుంటారు. ఉన్న పరిస్థితులను ఎదుర్కొడానికి కావాల్సిన ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రయత్నించాలి. దీనికి మస్తిష్క నిర్మాణం ఉపయోగపడుతుంది. ఈ నిర్మాణాన్ని బలోపేతం చేయగలమా అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.                    – డా.ఎన్‌ఎన్‌ రాజు, మానసిక వైద్య నిపుణుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top