పెళ్లి రోజే అనంత లోకాలకు

Software Died On Marriage Day In Hyderabad - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య?

పని చేసే భవనం వద్ద మృతదేహం 

ఆత్మహత్యగా చిత్రించే యత్నం 

బంజారాహిల్స్‌: ఆనందంగా పెళ్లిరోజు జరుపుకోవాల్సిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇదే రోజు ఉద్యోగి దారుణ హత్యకు గురైన విషాద ఘటన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.8లోని మాస్‌ హైట్స్‌ బిల్డింగ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన నవులూరి శివనాగరాజు (35) హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూరులో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.8లోని మాస్‌ హైట్స్‌ బిల్డింగ్‌లో అయిదో అంతస్తులో కొనసాగుతున్న జారో ఎడ్యుకేషన్‌ అనే సంస్థలో ఎనిమిదేళ్లుగా ఆయన హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఆయన పెళ్లిరోజు జరుపుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కుంట్లూరు నుంచి విధులకు బయల్దేరారు. రాత్రి 8 గంటల సమయంలో ఆయన భార్య రమాదేవి అలియాస్‌ నవ్య ఇంటికి ఎప్పుడొస్తున్నారంటూ భర్తకు ఫోన్‌ చేశారు. తను ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని, 10 గంటల తర్వాత వస్తానంటూ ఆయన చెప్పారు. రాత్రి 12 గంటలు దాటినా భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకుండాపోయింది. సుమారు అరవైసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో బంజారాహిల్స్‌లో నివసించే భర్త స్నేహితుడికి సమాచారం ఇచ్చారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆయన స్నేహితుడు మాస్‌ హైట్స్‌ భవనానికి వచ్చి చూడగా ఆవరణలో రక్తపు మడుగులో శివనాగరాజు మృతదేహం కనిపించింది. ఆయన వెంటనే నవ్యకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయిదో అంతస్తు నుంచి కిందపడ్డట్లుగా బయట ఉన్న సీసీ ఫుటేజీల్లో నమోదైంది. లోనికి వెళ్లి చూడగా రాత్రి 8.30 గంటలకు సీసీ కెమెరాలన్నీ నిలిపివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటిపై నాలుగు చోట్ల కత్తిగాట్లు గుర్తించారు. కత్తితో  మెడ కోసినట్లుగా తేలింది.

శివనాగరాజును హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆ కార్యాలయంలో పని చేస్తున్న మేనేజర్, ఇతర సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పై నుంచి కిందకు దూకుతున్నట్లు సీసీ ఫుటేజీల్లో నమోదు కావడం, కార్యాలయం లోపల సీసీ కెమెరాలన్నీ బంద్‌ కావడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడి ఒంటిమీద కత్తిగాట్లు ఉన్నాయని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఏం జరిగిందన్నది ఆరా తీస్తున్నామని చెప్పారు. అలాగే శివనాగరాజు భార్య నవ్యను కూడా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఎవరైనా శత్రువులున్నారా అనే విషయంపై  ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top