అన్నీ తానైన అన్న; హతమార్చిన చెల్లెలు

Sister Killed Own Brother Over Supporting Her Daughter Marriage - Sakshi

సాక్షి, బెంగళూరు : భర్త చనిపోయిన తరువాత తనకు అండగా నిలిచిన అన్నపైనే అక్కసు పెంచుకుందో చెల్లి. తన కూతురి పెళ్లి చేయడానికి సిద్ధమైన అన్నను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని కెంగెరీలో చోటుచేసుకుంది. వివరాలు... ఈనెల 22న కెంగేరి సమీపంలో విశ్వేశ్వరయ్య లేఔట్‌లో రాజశేఖర్‌ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేయయడంతో రాజశేఖర్‌ చెల్లెలు గౌరమ్మ స్వయంగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు బయట పడింది. ఈ క్రమంలో గౌరమ్మను, ఆమెకు సహకరించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బావ మరణించాడని..
గౌరమ్మ భర్త మరణించడంతో రాజశేఖర్‌ చెల్లి కుటుంబానికి అన్నీ తానై వెంట ఉన్నాడు. తన మేనకోడలు(గౌరమ్మ కూతురు) పెళ్లి చేయాలనే తలంపుతో అనేక సంబంధాలు చూడగా... ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చడంతో ఈ నెల 26న బుధవారం పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కళ్యాణ మంటపంతో పాటు బంధుమిత్రులకు ఆహ్వన పత్రికలను అందించారు. అయితే గౌరమ్మకు తన కుమార్తెకు ఇప్పుడే పెళ్లి చేయటం ఇష్టం లేదు. అదే కాకుండా రాజశేఖర్‌ చూసిన సంబంధం గౌరమ్మకు నచ్చక పోవటంతో కొద్ది రోజుల నుండి ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. ఇవేమీ పట్టించుకోకుండా రాజశేఖర్‌ కుటుంబంతో అబ్బాయి తరపు వారు పెళ్లి ఏర్పాట్లను ముమ్మరం చేసుకొన్నారు. తనకు ఇష్టంలేని పెళ్లిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్న గౌరమ్మ పెళ్లికి రెండు రోజుల ముందు అన్ననే హత్య చేస్తే అన్ని సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న కెంగేరికి చెందిన ముత్తాజ్, మున్నా, అర్జి, షాకీబ్‌లకు గౌరమ్మ రూ. 3 లక్షల సుపారీ ఇచ్చింది. తన ప్లాన్‌లో భాగంగా ఆరోజు సాయంత్రం ఏదో పని ఉందంటూ అన్నను తీసుకుని విశ్వేశ్వరయ్య లేఔట్‌ వద్దకు వెళ్లింది. అక్కడే ముందుగానే కాపుకాసిన నిందితులు రాజశేఖర్‌ తలపై కొట్టి హత్య చేశారు. ఈ క్రమంలో నేరం తనపైకి రాకుండా ఉండేందుకు తన అన్నను కాబోయే అల్లుడు హత్య చేయించినట్లు పోలీసుల ముందు నాటకం నాడింది. అబ్బాయి కుటుంబంపై కేసు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేసింది. అయితే గౌరమ్మ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావటంతో ఆమె ఫోన్‌ నంబర్లకు వచ్చిన కాల్‌ లిస్ట్‌ను పరిశీలించారు. నిందితులకు పాత కేసులతో సంబంధం ఉండటంతో ముత్తాజ్, మున్నా, అర్జి, షాకీబ్‌లను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా రాజశేఖర్‌ హత్యకు సుపారీ ఇచ్చిన విషయం బయటపడింది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top