చీరల దొంగల గుట్టు రట్టు  

Sarees Thieves Arrested By Police Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : ఆన్‌లైన్‌లో పెట్టిన ఖరీదైన నేత చీరలపై కన్నేస్తారు. కొంత నగదును ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు. మిగిలిన నగదును చీరలను తీసుకెళ్లే సమయంలో ఇస్తామని నమ్మబలుకుతారు. పెద్దమొత్తం కావడంతో తమ ప్రాంతానికి రమ్మని వ్యాపారస్తుల్లో ఒకరిని తమ వాహనంలో తీసుకెళతారు. మార్గమధ్యంలో దించేసి పరారవుతారు. ఇదీ ధర్మవరంలోని వీవర్స్‌కాలనీని కేంద్రంగా చేసుకుని కొందరు నడుపుతున్న దందా. బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు చొరవతో దందా సోమవారం గుట్టురట్టైంది.  

బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని రామకృష్ణానగర్‌కు చెందిన సోము పుల్లయ్య అనే చేనేత కార్మికుడు తాను తయారుచేసిన చీరలను విక్రయించేందుకు జస్ట్‌ డయల్‌ యాప్‌లో వివరాలను పెట్టాడు. తన ఫోన్‌ నంబర్‌ను అందులో ఉంచాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కేశాని అశోక్‌ అనే వ్యక్తి తనకు అక్షయ శిల్క్‌ అనే చీరల దుకాణం ఉందని, చీరలు కావాలని పుల్లయ్యతో ఫోన్‌లో మాట్లాడాడు. దుకాణానికి సంబంధించి జీఎస్టీ పత్రాలను వాట్సాప్‌లో పంపాడు. ఈ క్రమంలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు అశోక్, ధర్మవరానికి చెందిన బీదల సంజీవరెడ్డి, రుద్ర రెడ్డెప్ప ఖరీదైన కారులో బుచ్చిరెడ్డిపాళెంలోని పుల్లయ్య నివాసానికి వచ్చారు.

పుల్లయ్యతోపాటు స్థానిక చీరల వ్యాపారులు పప్పు నారాయణరావు, నారే ప్రసాద్, కలిగిరి శ్రీనివాసులుతో మాట్లాడి 379 చీరలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన మొత్తంలో రూ.88 వేలను గూగుల్‌పే, ఫోన్‌ పే యాప్‌ల ద్వారా పంపారు. రూ.10 వేలు నగదు రూపంలో ఇచ్చారు. మిగిలిన మొత్తం మీలో ఎవరైనా ఒకరు ధర్మవరానికి వస్తే ఇస్తామని నమ్మబలికారు. దీంతో వ్యాపారులు ఒప్పుకున్నారు. చీరలను కారులో నింపి వారితోపాటు పుల్లయ్యను పంపారు. ఈక్రమంలో కారు ఆత్మకూరు మండలం కరటంపాడు వద్దకు రాగానే ఇరుగ్గా ఉందని చెప్పి పుల్లయ్యను కిందికి దించారు. దిగిన వెంటనే పుల్లయ్యను నెట్టివేసి అక్కడి నుంచి పరారయ్యారు. పుల్లయ్య జరిగిన విషయాన్ని తోటి వ్యాపారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. 

చీరాలకు వెళుతూ పట్టుబడ్డారు 
దొంగిలించిన పట్టుచీరలను విక్రయించేందుకు ప్రధాన నిందితుడు కేశాని అశోక్‌ టాటా ఏస్‌ వాహనంలో నెల్లూరు మీదుగా చీరాలకు బయల్దేరాడు. ఈ క్రమంలో వెంకటేశ్వరపురం వద్దకు రాగానే వాహనం మరమ్మతులకు గురైంది. అశోక్‌ మరో వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటికే సీఐ సురేష్‌బాబు నిఘా వేసి ఉండడంతో బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై జి.బలరామిరెడ్డి తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఇదే తరహాలో నిందితుడు గతంలో ప్రకాశం జిల్లాలోను చోరీ చేశాడని సీఐ సురేష్‌బాబు తెలిపారు. మిగిలిన ఇద్దరు బీదల సంజీవరెడ్డి, రుద్ర రెడ్డెప్ప పరారీలో ఉన్నారన్నారు. నిందితుడిని నిఘా వేసి పట్టుకోవడంలో కృషి చేసిన ఏఎస్‌ఐ టి.విజయ్‌భాస్కర్, కానిస్టేబుళ్లు టి.సురేష్‌బాబు, జె. మురళీకృష్ణలను ఆయన అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top