పట్టపగలే భారీ చోరీ

Robbery in Visakhapatnam Bheemili - Sakshi

నీళ్ల కుండీలు జంక్షన్‌లో 60 తులాల బంగారం,

5 కిలోల వెండి వస్తువులు, నగదు అపహరణ

చోరుల ఆచూకీ కోసం రంగంలోకి క్రైం బృందాలు

ఆనందపురం (భీమిలి) : నగర శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే భారీ చోరీకి పాల్పడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఒక ఇంట్లో చొరబడి బంగారం, వెండి వెస్తువులతో పాటు రూ.5లక్షల సొత్తుతో ఉడాయించారు. కుటుంబ సభ్యులు రాత్రి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత గానీ సంఘటన వెలుగు చూడలేదు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై బాధితులు అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. పెందుర్తి – ఆనందపు రం రోడ్డు పక్కన శొంఠ్యాం పంచాయతీ పరిధి లోని నీళ్ల కుండీలు జంక్షన్‌లో జరిగిన చోరీపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం... పిళ్లా నారాయణమూర్తి తన కుటుంబంతో నీళ్ల కుండీలకు సమీపంలో నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం ఉదయం నారాయణమూర్తి ఇంటి వద్ద నుంచి బయలుదేరి పొలంలోకి వెళ్లి పోయాడు. అలాగే అల్లుడు మాకిన మురళీ కృష్ణ ఉద్యోగ రీత్యా ఉదయమే బయటకు వెళ్లాడు.

ఇంటి వద్ద ఉన్న నారాయణమూర్తి భార్య సరోజ, కుమార్తె సూర్యకుమారి విశాఖలో షాపింగ్‌ కోసమని ఇంటికి తాళాలు వేసి ఈ విషయాన్ని నారాయణ మూర్తికి ఫోన్‌లో తెలియజేసి వెళ్లారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఆరు గంటలు ప్రాంతంలో ఇంటికి వచ్చిన నారాయణమూర్తి తలుపులు తెరిచి చూడగా ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలు తలుపులు పగలుగొట్టి ఉన్నాయి. దీంతో అంతా పరిశీలించగా ఇంటి వెనుక వైపున గల తలుపు గొళ్లెంను పగలు గొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి వస్తువులు ఒక్కటి కూడా లేకుండా ఊడ్చుకుపోయారు. ఇటీవలే భూమిని విక్రయించగా అడ్వాన్స్‌గా వచ్చిన రూ.5లక్షలు సొమ్ముని బీరువాలో పెట్టగా తస్కరించారు. హారం, బ్రాస్‌లెట్, గాజులు వంటి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 5 కిలోల వివిధ రకాల వెండి వస్తువులను దోచుకుపోయారు. ఈ మేరకు బాధితులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఏడీసీపీ రమేష్‌బాబు, డీసీపీ ఎం.రవీంద్రబాబు, శాంతి భద్రతల విభాగం ఏసీపీ ఎ.వి.ఎల్‌ ప్రసన్న కుమార్, ఆనందపురం సీఐ జి.శంకరరావు సందర్శించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ల విచారణ
బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌ టీంను, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. ఇంట్లో అనువణువు  గాలింపు చేపట్టారు. తలుపులు, బీరువాలపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఇల్లు, పరిసర ప్రాంతాలలో తిరిగి రోడ్డు వరకు వచ్చి ఆగి పోయింది.

నిందితుల ఆచూకీ కోసం క్రైం బృందం
నేర స్థలంలో లభ్యమైన పలు వివరాల ఆధారంగా క్రైం బృందం నగరంలోని పలు ప్రాంతాలలో విచారణ జరుపుతోంది. పాత నేరస్తుల వివరాలను సేకరించి ఇక్కడ దొరికిన ఆధారాలతో సరి పోల్చుతున్నారు. చోరీ తెలిసిన వారి పనా ? లేదా ఏదైనా దొంగల ముఠా చోరీకి పాల్పడిందా అన్న విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top