చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు

Robbery Gang Arrest In Nalgonda - Sakshi

కారు, రూ.8.5లక్షల సొత్తు స్వాధీనం

నల్లగొండ క్రైం :జల్సాలకు అలవాటుపడి డబ్బులు లేకపోవడంతో రాత్రిపూట తాళం వేసి ఉన్న దుకాణాలు, ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠాసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టాటాబోల్డ్‌ కారు, రూ.8.5 లక్షల విలువైన సెల్‌పోన్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భూ డాక్యుమెంట్‌లు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను ఏఎస్పీ పద్మనాభరెడ్డి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని మునుగోడు ఎక్స్‌రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న వన్‌టౌన్, సీసీఎస్‌ పోలీసులు టాటా బోల్డ్‌కారును తనిఖీ చేయగా ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కని పించడంతో విచారించారు. మిర్యాలగూడలో దొంగతనం చేసేందుకు వెళ్తున్నట్లుగా తెలపడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దుంగులు గత నెలలో దేవరకొండ రోడ్డులోని మాధవ మొబైల్‌షాపులో చోరీ చేశారు. తిరుగు ప్రయాణంలో మునుగోడులోని పెట్రోల్‌ బంకులో డీజిల్, పెట్రోల్‌ దొంగలించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని పలు ఇండ్లల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను, వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొన్ని ల్యాండు డాక్యుమెంట్లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. చోరీలో భాగస్వామున్న మరో ముగ్గురు మహిళలను బోడుప్పల్‌లో అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ సుధాకర్, సీఐ రవికుమార్, అర్జున్‌రెడ్డి, సోమిరెడ్డి, విష్ణువర్ధన్, గిరి, శ్రీధర్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

ముఠా సభ్యులు వీరే..
చోరీలకు పాల్పడే ముఠాలో ముగ్గురు మైనర్లు, ముగ్గురు మేజర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన గంటా సుధాకర్, గంటా మధుకర్, అదే జిల్లాలోని మేడిపల్లి ప్రాంతంలో పద్మావతి కాలనీకి చెందిన బొడ్డు సాయితేజ, అదే జిల్లాలోని బోడుప్పల్‌ ప్రాంతంలోని ఆంజనేయనగర్‌కు చెందిన కొండా రాహుల్‌తో పాటు మరో ముగ్గురు బాల నేరస్తులున్నారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పాటు ఒకే పాఠశాలలో చదువుకున్న వారు కావడం వల్ల స్నేహితులుగా ఏర్పడ్డారు. చిన్నప్పటి నుంచే జులాయి తిరుగుళ్లకు అలవాటుపడి వ్యసనాలకు డబ్బులు లేక దొంగతనాల వైపు దృష్టిమళ్లించారు.

నేరేడుచర్లలో ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలు..
నేరేడుచర్ల (హుజూర్‌నగర్‌) : రాష్ట్రవ్యాప్తంగా పలుకేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నేరేడుచర్ల పోలీసులు పట్టుకున్నారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నరేష్‌ వివరాలు వెల్లడించారు. గత నెల 10న మండలంలోని పెంచికల్‌దిన్న గ్రామంలోని కొణిజేటి జ్యోతిబాబు ఇంట్లో వెండి వస్తువులు, డబ్బులు చోరీ ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన నీలగిరి సాయిబాబా, చిట్యాలకు చెందిన సయ్యద్‌ అబ్దుల్లా అనుమానితంగా తచ్చాడుతున్నారు. వారు చోరీ చేసిన ద్విచక్ర వాహనంతో ఉండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 4 తులాల బంగారం, 30 తులాల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో 1 గొలుసు జగిత్యాలలో, రెండు గొలుసులను నార్కట్‌పల్లిలో, పెంచికల్‌దిన్నలో 30 తులాల వెండి, నేరేడుచర్లలో 3 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు తెలిపారు. సాయి బాబా ఇప్పటి వరకు 32 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మోత్కూరు, నల్లగొండ, జనగామ, పాలకుర్తి, గణపురం, హుస్నాబాద్, వర్ధన్నపేట, మిట్స్‌ కాలనీ, çమహబూబాబాద్, దుగ్గొండి, మరిపెడ బంగ్లా, భువనగిరి, తుర్కపల్లి, నకిరేకల్, రఘునాథపల్లి, నర్మెట, సిద్దిపేట, వేములవాడ, జగిత్యాల, నార్కట్‌పల్లి, జమ్మికుంట, నేరేడుచర్ల స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశారు. సాయిబాబాకు సయ్యద్‌ అబ్దుల్లా జైలులో పరిచయడం కావడంతో ఇరువురు కలిసి కొంత కాలంగా దొంగతనాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను హుజూర్‌నగర్‌ మున్సిçఫ్‌ మేజిస్ట్రేట్‌లో హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐ సాగర్‌రావు, హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, జానకిరాములు, అంజయ్య, గఫార్, శ్రీనునాయక్, వీరయ్య, బీటీనాయక్, నట్టె శ్రీనివాస్, రమేష్, లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, రవి, లక్ష్మయ్య, కమాల్, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top