పగలు రెక్కీలు..రాత్రి లూటీలు..

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

నలుగురు దొంగల అరెస్టు

నిందితుల్లో ఇద్దరు వికారాబాద్‌ జిల్లా వాసులు

రూ.6.93లక్షల సొత్తు రికవరీ

నేరేడ్‌మెట్‌: ‘పగలు కాలనీల్లో  తిరుగుతూ తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు. రాత్రికి  ఇళ్ల తాళాలు పగులకొట్టి లూటీలకు పాల్పడుతున్నారు. కొన్నేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను నేరెడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం నేరేడ్‌మెట్‌ పీఎస్‌లో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. చంద్రగిరి కాలనీ (లాల్‌బజార్‌–సికింద్రాబాద్‌) కు చెందిన రాజుల వీరవంశి నాయుడు అలియాస్‌ సండి, చిన్న కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేసేవాడు. అతను వికారాబాద్‌లోని రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన బొడిగ శ్రీధర్‌ అలియాస్‌ సురేందర్, కారు మెకానిక్‌గా పని చేస్తున్న మరిపల్లిగూడకు చెందిన ప్రభుతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు.

గత నెల 19న ఘట్‌కేసర్‌ పరిధిలోని చౌదరిగూడలో ఓ ఇంటి తాళాలు పగులకొట్టి బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఒక సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తును డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్న వెల్చల్‌కు చెందిన కావలి నర్సింహ్మాకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఘట్‌కేసర్‌ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి సమాచారం మేరకు నర్సింహ్మాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 తులాల బంగారు, 28తులాల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్‌ సహా రూ.6.93లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సిబ్బందికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్‌  డీసీపీలు నాగరాజు, డీసీపీ సలీమా, ఏసీపీలు శివకుమార్, సందీప్, సీఐ,ఎస్‌ఐలు లింగయ్య, జగన్నాథ్‌రెడ్డి, శివశంకర్‌రావు, వెంకటేశ్వర్లు, కృష్ణారావులు పాల్గొన్నారు.

పలు ఠాణాల్లో కేసులు..
రాజుల వీరవంశీనాయుడుపై 2013 నుంచి పలు ఠాణాల్లో  ఇప్పటి వరకు 18 చోరీ కేసులు నమోదై ఉన్నాయి. బొడిగ శ్రీధర్‌పై 26 కేసులు, శివరాత్రి ప్రభుపై 2016 నుంచి 13 కేసులు ఉన్నాయి. కావలి నర్సింహ 2013లో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top