బ్యాగ్‌.. పర్సు.. సెల్‌ఫోన్‌!

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

ఏది ‘కనిపించినా’ లాక్కుపోతారు

ఆరుగురు సభ్యుల స్నాచింగ్‌ గ్యాంగ్‌

రెండు కమిషనరేట్ల పరిధిలో 10 నేరాలు

ఐదుగురిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓ వస్త్రవ్యాపారి సూత్రధారి... ఆటోడ్రైవర్, సేల్స్‌మెన్స్, చిరు వ్యాపారి, నిరుద్యోగి పాత్రధారుడిగా ఏర్పడిన ముఠా అది. బైక్‌పై అదును చూసుకుని స్నాచింగ్స్‌కు పాల్పడతారు. వీరు లాక్కుపోయేది కేవలం బంగారు గొలుసులే కాదు.. బ్యాగు, పర్సు, సెల్‌ఫోన్‌ వీటిలో ఏది చేతికి దొరికితే అది. వీరిలో కొందరికి గతంలోనూ నేరచరిత్ర ఉంది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో పది నేరాలు చేసిన ఈ గ్యాంగ్‌ గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లుతో కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు. 

టోలిచౌకీ అడ్డాగా..
మల్లేపల్లి ప్రాంతంలో ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ పేరుతో వస్త్రదుకాణం నిర్వహిస్తున్న సెవెన్‌ టూంబ్స్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌ ఖురేషీ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. హకీంపేటకు చెందిన మహ్మద్‌ అఫ్రోజ్‌ ఖాన్‌ (ఆటోడ్రైవర్‌), మహ్మద్‌ ఫెరోజ్‌ అలీ (సేల్స్‌మెన్‌), మహ్మద్‌ అలీముద్దీన్‌ (సేల్స్‌మెన్‌), మహ్మద్‌ అన్మాన్‌ (చిరు వ్యాపారి), ఫైసల్‌ (నిరుద్యోగి) ఇతడికి అనుచరులు. టోలిచౌకీలోని ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ను అడ్డాగా చేసుకున్న వీరు తరచూ కలుసుకునే వారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు సిద్ధమయ్యారు. బైక్‌ నడపడంలో నిష్ణాతుడైన సోహైల్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా, ముఠా సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉంటే వారిని వెనుక కూర్చోబెట్టుకుని ‘ఫీల్డ్‌’కు వెళ్లేవాడు. 

కనిపించేలా కత్తి తగిలించుకుని...
ఈ ముఠా సభ్యులు టోలిచౌకి, గోల్కొండ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో సమీపంలోని వెస్ట్‌జోన్, సైబరాబాద్‌లనే టార్గెట్‌గా చేసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న, ఒంటరిగా నడిచి వెళ్తున్న వారితో పాటు ఆటోల్లో ప్రయాణిస్తున్న వారినీ ఎంచుకుంటారు. సోహైల్‌ వేగంగా బైక్‌ నడుపుతూ వారి సమీపంలోకి వెళ్తాడు. వాహనాన్ని కాస్తా దూరంలో ఆపి సిద్ధంగా ఉంటాడు. వెనుక కూర్చున్న వ్యక్తి టార్గెట్‌ దగ్గరకు వెళ్లి పర్సు, బ్యాగ్, సెల్‌ఫోన్‌ వీటిలో ఏది దొరికితే అది లాక్కుని వచ్చేస్తాడు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి అక్కడి నుంచి జారుకుంటారు. ఎవరైనా బాధితుడు తిరగబడినా భయపెట్టడానికి సోహైల్‌ ఎప్పుడూ తన నడుముకు ఓ కత్తిని తగిలించుకుని, అది ఎదుటి వారికి కనిపించేలా షర్ట్‌ పైకి లేపి ఉంచుతాడు. దీంతో అనేక మంది బాధితులు వెంటపడే ధైర్యం చేయలేదు. 

వరుసపెట్టి నేరాలు..
ఈ ఏడాది జనవరి నుంచి నేరాలు ప్రారంభించిన వీరు కొన్నాళ్ల పాటు రెచ్చిపోయారు. ఆగస్టులో సోహైల్, ఫెరోజ్, మన్నన్‌లను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత జూలైలో లంగర్‌హౌస్‌ పరిధిలో ఓ నేరం చేశారు. ఆపై అక్టోబర్, నవంబర్‌ల్లో వరుసపెట్టి బంజారాహిల్స్, గోల్కొండ, హుమాయున్‌నగర్, ఎస్సార్‌నగర్, లంగర్‌హౌస్, నార్సింగిల్లో తొమ్మిది స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. సోహైల్‌ పది కేసుల్లోనూ నిందితుడు కాగా... ఆఫ్రోజ్‌ ఏడు, ఫెరోజ్‌ ఐదు, అలీముద్దీన్, ఫైసల్‌ మూడేసి, మన్నన్‌ ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్‌ ముజఫర్‌ అలీ వలపన్ని ఐదుగురిని పట్టుకున్నారు.

ఐ–ఫోన్లు చిత్తు... డాక్యుమెంట్స్‌ ‘చెత్త’...
మరో సభ్యుడు ఫైజల్‌ ప్రస్తుతం మత ప్రచారంలో ఉండటంతో అతను చిక్కలేదు. ఈ గ్యాంగ్‌ నుంచి పోలీసులు రెండు బైక్‌లు, నాలుగేసి చొప్పున హ్యాండ్‌బ్యాగ్స్, పర్సులు, ఎనిమిది సెల్‌ఫోన్లు తదితరాలతో పాటు రూ.32 వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు పోలీసుల దర్యా ప్తు తీరుపై అవగాహన ఉండటంతో తాము చోరీ చేసిన సెల్‌ఫోన్లు వినియోగిస్తే చిక్కుతామనే ఉద్దేశంతో వాటిని కేవలం వీడియో గేమ్స్‌ ఆడేందుకు మాత్రమే వాడేవారు. అన్‌లాక్‌ కాని ఓ ఖరీదైన ఐ– ఫోన్‌ను చిత్తుచిత్తు చేసి చెరువులో పాడేశారు. లాక్కుపోయిన బ్యాగ్స్‌లో ఉన్న నగదును తీసుకునే వీరు వాటిలోని విలువైన డాక్యుమెంట్స్‌ను చెత్తపాలు చేసేవారు. ఎస్సార్‌నగర్‌ సీతాఫలాలు అమ్ముకునే వ్యక్తి బ్యాగ్‌ను సైతం లాక్కుపోయిన చరిత్ర వీరికి ఉంది. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top