టక్‌..టక్‌ గ్యాంగ్‌ ఆటకట్టు

Robbery Gang Arrest In Hyderabad - Sakshi

దృష్టి మరల్చి చోరీలు  

అరెస్టు చేసినా సొత్తు రికవరీ సవాలే

చెన్నైకి చెందిన కన్నయ్య వద్ద చోరీలో శిక్షణ  

అంబర్‌పేట:     రెప్పపాటులో చోరీలు చేయడంలో వీరు నేర్పరులు. దృష్టి మరల్చడంలో సిద్ధహస్తులు. వీరిని అరెస్టు చేసినా చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం పోలీసులకు సవాలే. దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న రెండు ముఠాలను ఈస్ట్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఈస్ట్‌జోన్‌ కార్యాలయంలో డీసీపీ రమేష్, అడిషనల్‌ డీసీపీ గోవింద్‌రెడ్డి, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన వివరాలు వెల్లడించారు. ఢిల్లీ, తమిళనాడుకు ప్రాంతాలకు చెందిన  దేశవ్యాప్తంగా టక్‌ టక్‌ గ్యాంగ్‌గా పేరు పొందిన వీరు ఖరీదైన కార్లను ఎంచుకొని దృష్టి మరల్చి చోరీలు చేస్తారు. కారు పంక్చర్‌ చేయడం, లేదా కారు నుంచి ఇంజన్‌ ఆయిల్‌ లీకవుతుందని చెప్పి చోరీలకు పాల్పడేవారు. కారులో సమస్య ఉందని డోరు అద్దాలు టక్‌ టక్‌ మని కొట్టి చెప్పడం వీరి ప్రత్యేకత కావడంతో ఢిల్లీ పోలీసులు వీరికి టక్‌..టక్‌..ముఠాగా పేరు పెట్టారు. వీరు కారు పంక్చర్‌ చేసే పరికరం, ఇంజన్‌ ఆయిల్‌ డబ్బా వెంటే ఉంచుకుని చోరీలు చేస్తారు. చోరీ చేసిన సొత్తును క్షణాల్లో బదిలీ చేసి ఎవరికీ దొరక్కుండా జాగ్రత్త పడతారు. వీరి నుంచి చోరీ సొత్తును రికవరీ చేయడం పోలీసులకు సవాలే.

గత నెల 20న మలక్‌పేట్‌లోని హైదరాబాద్‌ రేస్‌క్లబ్‌లో బూకీగా వ్యవహరిస్తున్న రాజారాం మల్పాని రూ.5లక్షల నగదు తీసుకుని కారులో వెళుతుండగా దీనిని గమనించిన ముఠా సభ్యులు కారు పంక్చర్‌ చేశారు. ముఠాలో మరో సభ్యుడు కారు వద్దకు వచ్చి సార్‌ మీ కారు పంక్చర్‌ అయినట్లు చెప్పడంతో రాజారాం కారు దిగి పరిశీలిస్తుండగా మరో సభ్యుడు కారు వెనుక సీట్లో ఉన్న సూట్‌కేసును చోరీ చేశారు. దీనిపై బాధితుడు చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. గురువారం చాదర్‌ఘాట్‌

పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఏటీఎంలో సయ్యద్‌ ఖాజాపాషా అనే వ్యక్తి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుండగా ఇదే ముఠా దృష్టి మరల్చి చోరీకి ప్రయత్నించగా అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 12 మంది సభ్యులు గల ఈ ముఠాలో అనిల్, ఎస్‌.నాగరాజు, దయాల్, సామ్యుల్‌ అరుణ్, ఎస్‌.లోకేష్, ఎన్‌.రాముకుమార్, సుమిత్ర, సుగుణతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.
అశోక్, సందీప్‌ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.   తమిళనాడుకు చెందిన వీరి నుంచి రూ.2.05 లక్షల నగదు, 10 సెల్‌ ఫోన్లు, రెండు బైక్‌లు, ఒక పంక్చర్‌ చేసే
పరికరం, ఒక ఇంజన్‌ ఆయిల్‌ సీసాను స్వాధీనం చేసుకున్నారు.  

చోర విద్యలో శిక్షణ..
వీరు తమిళనాడుకు చెందిన కన్నయ్య అనే ఘరానా దొంగ వద్ద శిక్షణ పొందినట్లు తెలిపారు. కన్నయ్య 2017లో ఢిల్లీలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడన్నారు. అతను రెండు బృందాలకు దృష్టి మరల్చి చోరీలు చేయడంపై శిక్షణ ఇచ్చారని,  పట్టుబడ్డ ముఠా సభ్యులు అతడి శిష్యులేనని తెలిపారు. అతని కోసం కూడా గాలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top