దొంగలు పడ్డారు

Robbery in Chittoor - Sakshi

జిల్లాలో దొంగలు విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక మండలంలో దొంగలు పడటం పరిపాటిగా మారింది. ఇటీవలే పీలేరు, చిత్తూరు పట్టణాలను దొంగలు ఓ చూపు చూశారు. సీసీ కెమెరాలు ఉంటున్నా దొంగలు ఏమాత్రం జంకడం లేదు. చోరీలు చేయడంలో  రెచ్చిపోతున్నారు. గుడిపాల, వాల్మీకిపురం మండలాల్లో దొంగలు పడిన ఉదం తాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. పోలీసులు ఎప్పుడు ఈ దొంగల భరతం పడతారో మరి!

పట్టపగలే చోరీ!
గుడిపాల : తన ఇంటిలో దాచిన రూ.2.5లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు పిళ్లారికుప్పం వాసి చంద్రశేఖర్‌ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ షేక్‌షావలి కథనం..చంద్రశేఖర్‌ అతని భార్య శివగామి చిత్తూరులో అరటిపండ్ల వ్యాపారం చేస్తుంటారు.ప్రతిరోజూ వారు ఇంటి నుంచి చిత్తూరుకు వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న తన బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డ్‌లో చంద్రశేఖర్‌ రూ.2.5లక్షలను ఉంచారు. ఈ ఇంటికి సీసీ కెమెరాలు ఉండడంతో ఎప్పటికప్పుడు ఇంటిలోకి ఎవరైనా వెళితే అతని సెల్‌ఫోన్‌కు మెస్సేజ్‌ వెళ్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంటిలోకి ఎవరో వెళ్లినట్లుగా సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. చిత్తూరులో ఉన్న చంద్రశేఖర్‌ అప్రమత్తమై పక్క గ్రామంలో ఉన్న తమ బంధువులకు ఫోన్‌చేసి వారి ఇంటికి వెళ్లమని తెలియజేశాడు. వారు అక్కడికి వెళ్లేసరికి ఇంటిలో దొంగలు పడ్డట్లు గుర్తించారు. సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటిలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. 25 ఏళ్ల యువకుడు మొహానికి మాస్క్‌ ధరించి, ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డై ఉండటం గుర్తించారు. ఈ యువకుడి భరతం పట్టే పనిలో పోలీసులు పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చింతపర్తిలో..
వాల్మీకిపురం : విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట దొంగలు పడిన సంఘటన ఆదివారం రాత్రి చింతపర్తిలో చోటుచేసుకుంది. వివరాలు..చింతపర్తిలోని తిరుపతి  రోడ్డుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించి దొంగలు ఆదివారం అర్ధరాత్రి  ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలను పగలగొట్టి  ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రూ.20లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేశారు. సోమవారం ఇది వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ ఉలాసయ్య, ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top