దారి చూపిన నిర్లక్ష్యం..

Robbery Case Reveals Hyderabad Police - Sakshi

జపనీస్‌ గార్డెన్‌లో పనిచేయని సోలార్‌ ఫెన్సింగ్‌

దొంగకు మార్గం సుగమం

ఉత్తమ్‌ రెడ్డి ఇంట్లో 14 సీసీ కెమెరాలు ఉన్నా రెండింటిలోనే నిందితుడి చిత్రాలు

బంజారాహిల్స్‌:  ఓ వైపు అధికారుల బాధ్యతా రాహిత్యం, మరో వైపు ఇంటి యజమానుల నిర్లక్ష్యం దొంగకు మార్గం చూపాయి. ప్రముఖ బిల్డర్‌ టీ ఉత్తమ్‌ రెడ్డి ఇంట్లో రెండు రోజుల క్రితం దొంగలు పడి రూ. 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు తస్కరించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని ఉత్తమ్‌ రెడ్డి ఇంటి సమీపంలోని జీహెచ్‌ఎంసీ జపనీస్‌ గార్డెన్‌లో సోలార్‌ ఫెన్సింగ్‌ సిస్టమ్‌ గత ఆరు నెలలుగా పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది. దీంతో దొంగ ఈ పార్కులోంచే గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ప్రహరీ పై ఉన్న సోలార్‌ ఫెన్సింగ్‌ ఫెన్సింగ్‌ పనిచేసి ఉంటే అతను విద్యుదాఘాతానికి గురై ఉండేవాడు. ఇదిలా ఉండగా చోరీకి ముందు సదరు నిందితుడు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వారు ఎప్పుడు నిద్రపోతారు? ఉదయం ఎప్పుడు లేస్తారో? వారి రాకపోకల కదలికలను గమనించిన నిందితుడు ఎక్కడి నుంచి వెళితే సమస్య ఉండదో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

జపనీస్‌ గార్డెన్‌ ప్రహరీపై సోలార్‌ ఫెన్సింగ్‌ పనిచేయకపోవడం, ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ప్రతి ఒక్కరి కదలికలను గమనించిన అనంతరమే అతను చోరీకి శ్రీకారం చుట్టినట్లు తేలింది. కాగా ఉత్తమ్‌ రెడ్డి ఇంటి చుట్టూ 14 సీసీ కెమెరాలు ఉన్నా కేవలం రెండింటిలో మాత్రమే నిందితుడి చిత్రాలు రికార్డయ్యాయి. మిగిలిన సీసీ కెమెరాలు సరైన  కోణంలో లేకపోవడం కూడా అతడికి కలిసి వచ్చింది.  నిందితుడి కోసం బంజారాహిల్స్‌ క్రైమ్‌ పోలీసులతో పాటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్‌ జోన్ల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు జైళ్లలో పాత నేరస్తుల కదలికలు, వారు విడుదలైన తర్వాత ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారన్న వివరాలను ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా జైల్లో పలువురు దొంగలను కలిసి ఆచూకీపై ఆరా తీశారు. ఈ తరహా దొంగతనం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసును త్వరతిగతిన చేధించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు దీనిని సవాల్‌గా తీసుకుంటున్నారు. దాదాపు 10 బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. బెంగళూరు, యూపీ, కోల్‌కతా, బీహార్‌ తదితర రాష్ట్రాల్లోనూ పాత నేరస్తుల వివరాలు, వారి కదలికలపై సమాచారంసేకరిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top