వేర్వేరు చోట్ల ఏడుగురు మృతి 

Road Accidents In Karimnagar - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వేర్వేరు చోట్ల ఏడుగురు చనిపోయారు. హుజూరాబాద్‌ పరిధిలో రెండు బైక్‌లు ఢీకొని నమిండ్ల సురేష్‌(28), గాజుల శ్రీధర్‌ ఊరాఫ్‌ నరేందర్‌(25) ప్రాణాలు వదిలారు.కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లెకు చెందిన కుర్రె సతీష్‌(21) బైక్‌ అదుపుతప్పి మృతిచెందాడు. రాయికల్‌ మండలం రాజానగర్‌ గ్రామశివారులో క్రేన్‌ కిందపడి రెండునెలల చిన్నారి రోహిత్‌ చనిపోయాడు.  చొప్పదండి మండల కేంద్రానికి చెందిన ఎలిగేటి వెంకటేశం(52) చికిత్స పొందుతూ, తిమ్మాపూర్‌ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కానిగంటి జోగవ్వ(86) బావిలోపడి, అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి చెందిన ఎలిగేటి మల్లేశ్‌(30) ప్రమాదవశాత్తు మరణించారు.

హుజూరాబాద్‌రూరల్‌: మండలంలోని బోర్నపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నమిండ్ల సురేష్‌(28), అదే గ్రామానికి చెందిన మొలుగూరి రాజేష్, నమిండ్ల ప్రసాద్‌లు కలిసి ద్విచక్రవాహనంపై హుజూరాబాద్‌ వైపు వస్తున్నారు. సైదాపూర్‌ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గాజుల శ్రీధర్‌ ఊరాఫ్‌ నరేందర్‌(25) తన స్వగ్రామానికి ద్విచక్రవాహంనపై వెళ్తున్నాడు.

బోర్నపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో నమిండ్ల సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన గాజుల శ్రీధర్‌ను హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మొలుగూరి రాజేష్, నమిండ్ల ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బైక్‌ అదుపుతప్పి ఒకరు.. 
కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లె గ్రామానికి చెందిన కుర్రె సతీష్‌(21) ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరో ఇద్దరు ఉడుత శ్రీనివాస్, పనాస రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వీరు పెద్దపల్లిలో క్రేన్‌ పనికోసం కూలీకి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా బైక్‌ అదుపుతప్పింది. సతీశ్‌కు తల్లిదండ్రులు స్వరూప,గట్టయ్య ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నెలలకే నూరేళ్లు..
రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ మండలం రాజానగర్‌ గ్రామశివారులో క్రేన్‌ కిందపడి రెండునెలల చిన్నారి రోహిత్‌ చనిపోయాడు. ఎస్సై కరుణాకర్‌ వివరాల ప్రకారం... యాదాద్రి జిల్లా కోరికర్ల గ్రామానికి చెందిన ఆనంద్‌ కుటుంబంతో రెండునెలల క్రితం ఉపా«ధికోసం రాయికల్‌ మండలం ఉప్పుమడుగు గ్రామానికి వచ్చాడు. ఆనంద్‌ ఆయన భార్య ఆదివారం సారంగపూర్‌ మండలం రంగపేట గ్రామానికి చెందిన బాల మహేష్‌ బావి తవ్వారు. ఈ క్రమంలో తమ ఒక్కగానొక్క కొడుకు రోహిత్‌ను క్రేను చీరతో కట్టిన ఊయలలో పడుకోబెట్టారు. ప్రమాదవశాత్తు క్రేన్‌ నట్టుబోల్ట్‌లు ఊడిపోయాయి. రోహిత్‌ క్రేన్‌ కిందపడి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బావిలో పడి వృద్ధురాలు...
అల్గునూర్‌(మానకొండూర్‌): తిమ్మాపూర్‌ మండ లం గొల్లపల్లి గ్రామానికి చెందిన కానిగంటి జోగవ్వ(86) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిందని ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఒంటిగంట సమయంలో వ్యవసాయబావి వద్దకు నడుచుకుంటూ వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో వృద్ధురాలి కొడుకు కానిగంటి మల్లారెడ్డి బావి వద్దకు వెళ్లి చూశాడు. అందులో పడి మృతిచెంది ఉండడంతో స్థానికులసాయంతో వెలికితీశాడు. మల్లారెడ్డి ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేశారు.
 
ప్రమాదవశాత్తు ఒకరు...
రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామానికి చెందిన ఎలిగేటి మల్లేశ్‌(30) ప్రమాదశాత్తు చనిపోయాడు. మల్లేశ్‌ మరో ముగ్గురితో కలిసి వంటచెరుకుకు సమీపంలో అటవీప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వంట చెరుకు నిమిత్తం ఎండుకర్రలను మరో వ్యక్తి గొడ్డలితో నరుకుతున్న క్రమంలో గొడ్డలి కామ విరిగి మల్లేశ్‌కాలుకు తగడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మల్లేశ్‌కు భార్య, ఇద్దరు కూతుర్లున్నారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు   
చొప్పదండి: మండల కేంద్రానికి చెందిన ఎలిగేటి వెంకటేశం(52) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై చేరాలు కథనం ప్రకారం... ఈ నెల 11న అంబేద్కర్‌చౌరస్తా సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరీంనగర్‌ వైపు వెలుతున్న ఆటో వెనకనుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాలపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌ మునిగాల మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top