ఏసీబీ వలలో రెవెన్యూ చేప

Revenue surveyor catched red handedly demanding bribe - Sakshi

రూ.10 వేలు లంచం తీసుకుంటూ  పట్టుబడిన సర్వేయర్‌

నెల్లూరు(వేదాయపాళెం): ఏసీబీ వలలో రెవెన్యూ చేప చిక్కింది.  స్థలం పొజిషన్‌ రిపోర్టు  ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఉండగా నెల్లూరు మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పటుకున్నారు. నెల్లూ రు ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డి సమాచారం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన సంక్రాంతి కల్యాణ్‌  కుమార్తె నీలిమ పేరుపై నెల్లూరురూరల్‌ మండలం నవలాకుల గార్డెన్‌ సమీపంలో సర్వే నంబర్‌ 246/సీ/2ఏలో 55 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలోని 33 అంకణాల స్థలం తమదని కొందరు ముస్లింలు అడ్డం తిరగడంతో  ఎనిమిది నెలలుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కళ్యాణ్‌ సదరు భూమిని సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని నెల్లూరురూరల్‌ మండలం సర్వేయర్‌ దొడ్డి ఆదినారాయణను కోరారు.

దీంతో సర్వేయర్‌ రెండు నెలల కిందట జీపీఎస్‌ విధానం ద్వారా సర్వే చేశారు. సర్వే రిపోర్టు ఇవ్వకుండా ఆదినారాయణ రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ  బాధితుడిని తిప్పుకుం టూ వచ్చాడు. ఇటీవల రిపోర్టు విషయమై నిలదీయగా రూ.10 వేలు లంచం ఇస్తే రిపోర్టు ఇస్తానని సర్వేయర్‌ సూచించాడు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని సంక్రాంతి కల్యాణ్‌ గత నెల 28వ తేదీ నెల్లూరు ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ కేసు నమోదు చేశారు. ఆయన సూచనల మేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో సంక్రాంతి కల్యాణ్‌ నెల్లూరు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం  వెనుక వైపునున్న సర్వేయర్‌ గదిలో ఆదినారాయణను కలిసి రూ.10 వేలు లంచం ఇస్తుండగా, అప్పటికే అక్కడ కాపు కాసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. అతని చేతులు, నోట్లకు రసాయన పరీక్షలు నిర్వహించారు. సర్వేయర్‌ను విచారించడంతో సర్వే రికార్డులను పరిశీలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top