సిగ్గు.. సిగ్గు..!

Red Sand Smuggling In YSR Kadapa - Sakshi

జిల్లాలో ఓ వైపు ఎర్రచందనం యథేచ్ఛగా ఎల్లలు దాటుతుంటే.. అరికట్టాల్సిన అటవీశాఖలో అవినీతి హద్దులు మీరుతోంది. ఫలితంగా ఎర్రచందనం దొంగలు చెలరేగిపోతున్నారు. చేతికి దొరికిన 11 మంది స్మగ్లర్లు చేజారి పోయారంటే అది అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమా.. పరాకాష్టకు చేరిన అధికారుల అక్రమార్జనకు నిదర్శనమా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.నిజాయితీ నిబద్ధత కలిగిన కొందరు సిబ్బంది ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను పట్టుకుని వస్తే కొందరు వారుపారిపోయేందుకు మార్గం సుగమం చేయడం విమర్శలకు తావిస్తోంది.

సాక్షి ప్రతినిధి కడప: ఎర్రచందనం అక్రమరవాణాకు ఫారెస్టుశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందే ప్రధాన కారణమని గతంలో అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ పేరు కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తున్న తరుణంలో కొంతమంది అక్రమార్కులు శాఖ పరువు ప్రతిష్టలను బజారుకీడుస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిన ఉన్నతాధికారుల ఉదాసీనత ∙కూడా అందుకు కారణంగా పలువురు చెప్పుకుంటున్నారు. తాజాగా 11 మంది స్మగ్లర్లు తప్పించుకోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్లక్ష్యానికి బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది.

వీధినపడ్డ విద్యాధికుల కుటుంబం..
ఫారెస్టుశాఖ పుణ్యమా అని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన షేక్‌ కరీముల్లా, కలీమా అనే విద్యాధికుల దంపతులు వీధిపాలయ్యారు. ఒకరు ఎంబీఏ, మరొకరు ఎంఏ చేసిన ఆ దంపతుల పాలిట ఫారెస్టుశాఖ పెట్టిన తప్పుడు కేసు మనోవేదనకు గురిచేసింది. చెక్కడిపో ద్వారా జీవనం గడపుతున్న కరీముల్లాను స్మగ్లర్‌గా చిత్రీకరించారు. పెండ్లిమర్రి మండలం గంగనపల్లె రిజర్వు ఫారెస్టులో దుంగలు నరుకుతుండగా పట్టుకున్నట్లు 12 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పాత మొద్దులు కొనుగోలు చేసి వంట చెరుకుగా విక్రయించుకుని జీవించే వారి పట్ల కర్కశంగా వ్యవహరించారు.

చెక్కడిపోలో ఉన్న కరీముల్లాను తీసుకెళ్లడం, అక్కడున్న పాతమొద్దులను క్వాలీస్‌ వాహనంలో వెసుకెళ్లడం సీసీ కెమెరాల ఫుటేజీల్లో బహిర్గతమైంది. ఇందంతా ఒక ఎత్తయితే అక్రమంగా దుంగలు నరుకుతుండగా ప్రత్యక్షంగా పట్టుకొని వీరోచితంగా అదుపులోకి తీసుకున్నట్లు కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ మీడియా సమావేశంలో వెల్లడించి సిబ్బందిని అభినందించారు. సిబ్బంది చెబుతున్న మాటలకు దుంగలకు పొంతనే లేదన్న కనీస సోయి మర్చిపోయి డీఎఫ్‌ఓ వెల్లడించారు. విషయం బహిర్గతమైన తర్వాతైనా తప్పును సరిదిద్దుకున్నారా...అంటే అదీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
 
రాజంపేట ఘటన ఓ కట్టుకథ....
రాజంపేట అటవీశాఖ పరిధిలో ఉన్న 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లుకు పరారీ నేపథ్యంపై ఆశాఖ వెల్లడిస్తున్న విషయం వాస్తవాలకు భిన్నంగా ఉందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రధాన ద్వారం తర్వాత ఒక్కటే గది. బయటికి రావాలంటే ప్రధాన ద్వారమే. వీరు చెప్పినట్లు కిటికి ఊచలు విరిచి 11 మంది పరారీ అవుతోంటే ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఎక్కడికి వెళ్లినట్లు. రేంజ్‌ ఆఫీసర్‌ సెలవులో ఉన్నారని తెలుస్తోంది.

డీఆర్‌ఓ ఎక్కడికి వెళ్లారు? 11మంది ప్రహరీగోడ దూకి పరారై ఉంటే గోడకు కనీసం మట్టి మరకలు కూడా ఎందుకు అంటుకోలేదు? వర్షంతో ఆ ప్రాంతమంత బురదమయంగా ఉన్నా గోడలకు మట్టి అంటుకోకుండానే పరారీ అయ్యారా? లేదా ప్రధాన గేటు ద్వారా వెల్లిపోయి, కిటికీ ఊచలు ఉదంతం వెలుగులోకి తెచ్చారా? అన్న సందిగ్ధం హల్‌చల్‌ చేస్తోంది. డీఆర్‌ఓ ఎన్‌.రఘుశంకర్‌పై గతంలో అనేక ఆరోపణలున్నాయి. సానిపాయ బీట్‌లో వివిధ రకాల ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా స్మగ్లర్లు పరారీ ఘటన వెలుగుచూసింది. అదే ఫారెస్టు గృహం నుంచి గతంలో కూడా స్మగ్లర్లు పరారీ ఉదదంతం ఉన్న నేపథ్యంలో నిర్లక్ష్యం అసాధ్యం? స్మగ్లర్లతో లోపాయకారి ఒప్పందం మేరకే పరారీకీ ఆస్కారం ఉన్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top