రియల్‌ భూములకూ రైతుబంధు!

Raitu bandhu  To Real lands - Sakshi

బషీరాబాద్‌ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన 20 గుంటల వ్యవసాయ భూమిని గతంలో ఇళ్ల స్థలాలకు విక్రయించాడు. కొనుగోలుదారులు సదరు ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోవడంతో.. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఆయన పేరుపైనే ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కూడా మంజూరైంది.  

తాండూరు మండలం గౌతపూర్, సాయిపూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు తమ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చారు. ఇందులోని కొన్ని ప్లాట్లను విక్రయించారు. అయితే రికార్డుల ప్రక్షాళనలో ఆ వివరాలు పార్ట్‌ బీలో చేర్చకపోవడంతో వీరికి సైతం రైతుబంధు చెక్కులు మంజూరయ్యాయి.

బషీరాబాద్‌ : జిల్లాలో ఇలాంటి కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. రికార్డుల ప్రక్షాళన సమయంలో వాణిజ్య పరమైన భూములను గుర్తించడంలో రెవెన్యూ యంత్రాంగం చూపిన ఉదాసీనత కారణంగా రియల్‌ భూములకు సైతం రైతుబంధు సాయం అందుతోంది. సర్వే సమయంలో రైతుల పాత పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణాన్ని చూసి యథావిధిగా రాశారు. కొంత మంది తమ భూములను ఇతరులకు విక్రయించినప్పటికీ కొనుగోలుదారు పేరున పట్టా మార్పిడి కాకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న చెక్కులు విక్రయదారుల పేరునే వస్తున్నాయి.

దీంతో భూములను కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 8,80,152 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటికి గాను 2,65,169 ఖాతాలు ఉండగా 2,24,704 పట్టాపాసు పుస్తకాలు ఉన్నట్లు ప్రక్షాళనలో తేలింది. తద్వారా 40,465 ఎకరాల వ్యవసాయేతర (కోర్టు కేసులు, పరిష్కారం కాని, దేవాదాయ) భూములున్నాయి. వీటిని ఎల్‌ఆర్‌యూపీలో పార్ట్‌ బీ కింద నమోదు చేశారు.

అయితే చాలా గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములు రోడ్లకు, ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఆ భూములు రికార్డుల్లో ఇప్పటికీ సదరు యజమానుల పేర్ల మీదనే ఉన్నాయి. వాస్తవానికి అలాంటి వాణిజ్య భూములను వ్యవసాయేతర భూముల కింద పార్ట్‌బీలో చేర్చాల్సి ఉన్నా.. ప్రక్షాళనలోని లొసగుల కారణంగా దీనిపై స్పష్టత రాలేదు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కింద భూములు విక్రయించిన వారికి సైతం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందుతుండటం గమనార్హం.

ఇలా ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న ప్రజాధనం కొంతమేర దుర్వినియోగం అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారుల వాదన మరోలా ఉంది. రెవెన్యూ శాఖ ఇచ్చిన భూముల వివరాల ఆధారంగా పట్టాదారు పేరున చెక్కులు ఇస్తున్నామని చెబుతున్నారు.   

బీడు భూములకు సైతం చెక్కులు..  

రైతుల పేర్ల మీద ఉన్న బీడు భూములను సైతం సాగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం చెక్కులు జారీ చేస్తోంది. రైతు ఎన్ని ఎకరాలకు చెక్కులు తీసుకుంటే అన్ని ఎకరాలు సాగు చేయాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 2,24,704 మంది రైతులకు గాను రూ.243,34,80,910 చెక్కులను ఈ నెల 10నుంచి 17వరకు గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కోసం సెంటర్లలో తాగునీరు, వసతుల కల్పనకు జిల్లాకు అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top