వీడిన యువతి హత్య కేసు మిస్టరీ

Police solve Girl death mystery in west godhavari district - Sakshi

వారం కిందట కేశవరంలో ఘటన

కోరిక తీర్చలేదని గొంతు కోసి హత్య

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

గణపవరం(పశ్చిమ గోదావరి జిల్లా) : గణపవరం మండలం కేశవరం గ్రామంలో సంచలనం కలిగించిన యువతి హత్యకేసు మిస్టరీని గణపవరం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితులను బుధవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. దాదాపు వారంరోజుల క్రితం కేశవరంలో మంచినీటి చెరువుగట్టు వద్ద ఒక మహిళకు చెందిన చున్నీ, చెప్పులు, చెవిరింగుతో పాటు రక్తపు మరకలు కూడా కనిపించడంతో ఎవరో మహిళ హత్యకు గురైనట్టు గ్రామంలో ప్రచారం జరిగింది. ఈ విషయం గ్రామంతో పాటు పరిసర గ్రామాలలో తీవ్ర సంచలనం కలిగించింది. సమాచారం అందుకున్న గణపవరం పోలీసులు గ్రామానికి వచ్చి సంఘటనా స్థలంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ విచారణ చేసినా ఆధారాలు లభించలేదు. జల్లెడ పట్టినా హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లభించలేదు. సమీపంలోని చెర్వులో కూడా పడవలపై వలలతో వెతికించినా ఫలితం లేదు. డాగ్‌స్క్వాడ్‌ కూడా తనిఖీలు నిర్వహించినా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 

ముమ్మర దర్యాప్తు
ఆ యువతితో పాటు సహజీవనం చేస్తున్న వ్యక్తి, అతనికి బంధువులైన మరో ఇద్దరు వ్యక్తులు కూడా గ్రామం విడిచి పరారవ్వడంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. యువతి ఏమైంది? నిజంగా యువతిని హత్య చేశారా? లేదా దెబ్బలు తగిలి గాయాల వల్ల రక్తం కారిందా? అసలు యువతి బతికే ఉందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ప్రత్యేక బృందాలు హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ఆదివారం ఆ యువతి మృతదేహం యనమదుర్రు మురుగుకాలువ తూడు అడుగున లభ్యమైంది.

కోరిక తీర్చలేదని గొంతు కోసి హత్య
గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం గుబ్బల శ్రీను అనే యువకుడు లక్ష్మి అనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని కేశవరం గ్రామంలోని మునసా రాజయ్య అనే బంధువు ఇంటికి వచ్చి వారి ఇంట్లో వారితో పాటే ఉంటున్నాడు. రాజయ్య కుమారుడు వీరబాబు కొంతకాలంగా వ్యసనాలకులోనై భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతడికి కొంతకాలంగా లక్ష్మిపై కన్ను పడింది. తన కోర్కె తీర్చమని అతడు లక్ష్మిని అడుగుతున్నాడు. అతడిని ఆమె తిరస్కరించింది. దీంతో లక్ష్మి ప్రియుడు గుబ్బల శ్రీనును అతడు మచ్చిక చేసుకున్నాడు. శ్రీనుతో కలిసి వీరబాబు ఈ నెల 11వ తేదీ రాత్రి తమ ఇంటి సమీపంలోని చెర్వుగట్టు వద్దకు వెళ్లాడు. లక్ష్మిని అక్కడికి రమ్మని ఇద్దరూ కలిసి చాకుతో లక్ష్మి గొంతు కోశారు. ఈ ఘటనలో యువతి పెనుగులాడటం వల్ల ఘటనాస్థలంలో చున్నీ, కాలి చెప్పులు, గాయం వల్ల రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఉదంతాన్ని చూసిన వీరబాబు తండ్రి రాజయ్య వచ్చి లక్ష్మి బతికే ఉందని గమనించి చెరువులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపి, ఎటువంటి ఆధారాలూ దొరక్కుండా చేయాలని ముగ్గురూ కలిసి మృతదేహాన్ని సమీపంలోని యనమదుర్రు మురుగుకాలువలో గుర్రపుడెక్క కింద పూడ్చిపెట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు పర్యవేక్షణలో గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్‌ కేసును దర్యాప్తు చేశారు. బుధవారం రాత్రి ముగ్గురూ పిప్పర బస్టాండ్‌ వద్ద ఉన్నట్టు సమాచారం అందుకుని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్‌ చేసిన ఎస్సై దావు హరికృష్ణ, ఐడీ పార్టీ, ప్రత్యేక పోలీసులు ఆంజనేయులు, అక్బర్, ఎ.శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, ఎస్సైలు నాగేశ్వరరావు, సుబ్బారావు, హెచ్‌ఓ దుర్గారావులను సీఐ అభినందించారు. నిందితులను గురువారం కోర్టుకు హాజరుపరిచినట్టు ఆయన చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top