మర్లగూడెం.. రణరంగం

Police Resisted By People In land Issue West Godavari - Sakshi

సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదారి) : బుట్టాయగూడెం మండలం లోని మర్లగూడెం అటవీ ప్రాంతంలో మళ్లీ భూ వివాదం చెలరేగింది. బూసరాజుపల్లి, తూర్పురేగులకుంటకు చెందిన కొందరు గిరిజనులు అడవి భూములపై తమకు హక్కు ఉందంటూ అడవిలోని మొక్కలను మంగళవారం నరికే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం రేంజర్‌ కె.శ్రీవాణి ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులను అడ్డుకున్నారు. ఈ సమయంలో అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కంపేటకు చెందిన కొందరు ఆ భూములపై తమకూ హక్కు ఉందంటూ వచ్చారు. ఆ సమయంలో గిరిజనులకు, అక్కంపేటకు చెందిన వారికి మధ్య వాదోపవాదాలు జరిగాయి.

బూసరాజుపల్లికి చెందిన కొవ్వాసు రామచల్లాయమ్మ అనే గిరిజన యువతిపై అక్కంపేటకు చెందిన వ్యక్తి దౌర్జన్యం చేసినట్టు గిరిజనులు ఆరోపించారు. ఆమె చేతికి గాయం కావడంతో వైద్యం చేయించి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతమైన వాతావరణం ఉన్నా అనుకోకుండా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చల్లాయమ్మను కొట్టిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలంటూ ఫారెస్ట్‌ అధికారులను గిరిజనులు నిర్బంధించారు. అడవి నుంచి బయటకు రాకుండా రహదారిపై అడ్డంగా కూర్చున్నారు. సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గిరిజనులతో ఏఎస్సై ఐ.భాస్కర్‌ చర్చలు జరిపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే యువతిపై దౌర్జన్యం చేసిన వ్యక్తిని పోలీసులు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా అతడు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చారు.

చీకటిపడే సమయం కావడంతో పోలీసులు రహదారికి అడ్డంగా కూర్చున్న గిరిజనులను తప్పించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. గిరిజనులను తొలగిస్తూ నిర్బంధంలో ఉన్న వాహనాన్ని బయటకు తీసుకువచ్చే సమయంలో గిరిజనులకు, ఏఎస్సై భాస్కర్‌కు మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదం జరిగింది. అదే సమయంలో రేంజ్‌ అధికారి శ్రీవాణిని గిరిజన మహిళలు చుట్టుముట్టారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు రేంజ్‌ అధికారి శ్రీవాణిని వాహనంలో బయటకు తరలించారు. మహిళా పోలీసులు లేకుండా తమపై అధికారులు దౌర్జన్యం చేశారంటూ గిరి జన మహిళలు మడకం శారద, కొవ్వాసి వరలక్ష్మి, పైదా రాములమ్మ, ముచ్చిక గంగమ్మ ఆరోపించారు. చీకటి పడంతో అటవీ ప్రాంతం నుంచి ఎవరికి వారు వెళ్లిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top