మిస్టరీ వీడేదెన్నడు?

Police Investigating Murder Case And Bank Robbery Case In Anantapur - Sakshi

కరడుగట్టిన తీవ్రవాదులైనా నేరాలకు పాల్పడిన సమయంలో ఏదో ఒక క్లూ మరిచిపోతారు. దాని ఆధారంగా నిందితులను పోలీసులు పసిగడుతారు. అనేక ఘటనల్లోనూ.. కల్పిత చిత్రాల్లోనూ ఈ విషయం గమనించే ఉంటారు. కానీ తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిపుల్‌ మర్డర్, జిల్లా కేంద్రం అనంతపురంలో జరిగిన కో ఆపరేటివ్‌ అర్బన్‌ (టౌన్‌) బ్యాంకు దోపిడీ కేసుల్లో పోలీసులు ఇసుమంత కూడా క్లూ సంపాదించలేకపోతున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నా అసలు నిందితులు పట్టుబడడం లేదు. నిఘా నేత్రాలు కూడా నిందితులను గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

సాక్షి, అనంతపురం సెంట్రల్‌ : జిల్లా కేంద్రంలో పటిష్టమైన నిఘా ఉంటుంది. ఇప్పటికే వేలాది సీసీ కెమెరాలు నగరమంతా ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి సమయాల్లో పోలీసుల గస్తీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అలాంటి నగర నడిబొడ్డున ప్రధాన రహదారిలో ఉన్న కో ఆపరేటివ్‌ అర్బన్‌ (టౌన్‌బ్యాంకు)కు ఆగస్ట్‌ 30న కన్నం వేశారు. దాదాపు నెలన్నర గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేదు. దాదాపు కేజీకి పైగా బంగారం దోచుకుపోయారు. నిఘా వ్యవస్థలకు దొరకకుండా నేరుగా లాకర్‌రూం పై అంతస్తుకు కన్నం వేసి లోపలికి చొరబడ్డారు. పని ముగించుకొని వచ్చిన దారి గుండానే వెళ్లిపోయారు.  

ఈ ఏడాది జూలై 13న త్రిపుల్‌ మర్డర్‌తో ‘అనంత’ ఉలిక్కిపడింది. తనకల్లు మండలం కొర్తికోటలో శివరామిరెడ్డి(70), సోదరి కమలమ్మ(75),  సత్య లక్ష్మమ్మ(70)లు దారుణహత్యకు గురయ్యారు. అర్ధరాత్రి గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. హతుల రక్తాన్ని శివాలయంలో చల్లడంతో గుప్తనిధుల కోసం ఈ హత్యలు జరిగాయని అందరూ భావించారు. అయితే కేసును తప్పుదోవ పట్టించడానికే ఈ విధంగా చేసి ఉంటారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసం ప్రయత్నించినట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు.
 
ప్రొఫెషనల్స్‌ పని కాదంట! 
ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతారని అందరూ భావిస్తారు. చాలా సినిమాల్లో కూడా ప్రొఫెషనల్స్‌ నేరాలు ఈ విధంగానే చిత్రీకరిస్తారు. కానీ నిజజీవితంలో ఫ్రొఫెషనల్‌ కిల్లర్స్‌ ఎక్కడో ఒక చోట క్లూ మర్చిపోతారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ రెండు కేసుల్లో కూడా నిందితులు ప్రొఫెషనల్స్‌ కాకపోవడం వలనే ఎక్కడా క్లూ వదిలిపెట్టిపోలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలోనే సంచలనం కలగించిన జేఎన్‌టీయూ–ఏ ఎస్‌బీఐ బ్రాంచి రాబరీ ఘటనలో తక్కువ రోజుల్లో కేసు ఛేదించినందుకు జిల్లా పోలీసులకు అవార్డులు తెచ్చిపెట్టింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ ముఠా ముందురోజు బ్యాంకులో రెక్కీ నిర్వహించి మరుసటి రోజు బ్యాంకుకు కన్నం వేసింది. దాదాపు రూ. 40లక్షలకు పైగా నగదును అపహరించుకుపోయారు. పోతూపోతూ కిటికీలు, లాకర్‌ తెరిచేందుకు ఉపయోగించిన గ్యాస్‌కటర్స్‌ వదిలేసిపోయారు. దీని ఆధారంగా సిలిండర్‌ బెంగుళూరులో కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు... అక్కడి సీసీ కెమెరాల ఆధారంగా వారం రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకోగలిగారు.  

పోలీసులకు సవాల్‌  
కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు – త్రిపుల్‌ మర్డర్‌ కేసుల్లో పోలీసులకు ఇసుమంతైనా క్లూ దొరక్కపోవడం గమనార్హం. ఈ రెండు కేసులకు వేర్వేరుగా రెండు బృందాల అధికారులు పనిచేస్తున్నారు. నెలలతరబడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసుల్లో క్లూ కోసం ఇప్పటికే అనేక దొంగతనాలకు పాల్పడిన నేరస్తులను పట్టుకున్నారు. కీలక దొంగలు పట్టుబడ్డారు. కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు రాబరీ కేసుల్లో ఓ ఇరిగేషన్‌ ఉద్యోగి హస్తం ఉన్నట్లు గుర్తించి గుంతకల్లు నుంచి ఆయనను తీసుకొచ్చి వివిధ కోణాల్లో విచారించారు. ఇలాంటి బాధితులు అనేకమంది విచారణ ఎదుర్కొనడం, చివరకు వారికి కేసుతో సంబంధం లేదని తేలడంతో వదిలేయడం జరగుతోంది. కానీ అసలు నిందితులు మాత్రం పట్టుబడకపోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top