నకిలీ విత్తనంపై నిఘా

Police Attack On Fake Seeds Business Company Karimnagar - Sakshi

కరీంనగర్‌రూరల్‌: నకిలీ విత్తనాల విక్రయాలపై ఇటు వ్యవసాయ శాఖ.. అటు పోలీసు శాఖ అధికారులు నిఘా వేశారు. నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు విత్తన దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో పత్తి సాగు చేసేందుకు రైతులు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 1,37,500 ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి రైతులు 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఈ లెక్కన మొత్తం 2.75లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. ఎకరానికి రూ.1460 చొప్పున రైతులు విత్తనాలకు ఖర్చు చేస్తారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. అధికారుల కంటే విత్తన డీలర్ల మాటలనే రైతులు ఎక్కువగా నమ్ముతుంటారు.

డీలర్లు సైతం కమీషన్‌కు ఆశపడి రైతులకు నకిలీ, కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ముగ్గురు ఏడీఏలు, ముగ్గురు సీఐలు ఉన్నారు. మండల స్థాయిలో ఏవో, ఎస్సైలతో ప్రత్యేకంగా నిఘా కమిటీలను ఏర్పాటు చేసి విత్తన  దుకాణాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నా దాదాపు 70శాతం మంది రైతులు విత్తన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేస్తారు. నిఘా కమిటీ సభ్యులు తమ పరిధిలోని విత్తన దుకాణాలను తనిఖీ చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా...
ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. కొంతమంది బ్రోకర్లు ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో పత్తి సాగు ఎక్కువయ్యే ప్రాంతాల్లో విత్తనాలను నిల్వ చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా విత్తన డీలర్లతోపాటు కొంతమంది రైతుల సాయంతో కమీషన్‌ పద్ధతిలో విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో హుజూరాబాద్‌లో రూ.70లక్షల విలువైన 60క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పీడీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

నకిలీ విక్రయదారులపై  పీడీ చట్టం
నకిలీ, కల్తీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో రెండు కేసులు నమోదు చేశాం. నకిలీ విత్తనాల అమ్మకాలను నియంత్రించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి నిఘా కమిటీలను ఏర్పాటు చేశాం. రైతులు విత్తన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేసి తప్పనిసరిగా రశీదు పొందాలి. – వాసిరెడ్డి శ్రీధర్,జిల్లా వ్యవసాయాధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top