యువకుడు దారుణ హత్య

Person Brutually Murdered Because Of Love Affair In Mydukur - Sakshi

సాక్షి, మైదుకూరు(కడప) : మైదుకూరు మండలం ప్రకాశ్‌నగర్‌ ఎస్సీ కాలనీకి చెందిన చిన్న పీరయ్య(24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరు మండలం టీ.కొత్తపల్లె, ప్రకాశ్‌నగర్‌ ఎస్సీకాలనీలో నివాసముంటున్న కైపు చిన్నపీరయ్య (24) గత నాలుగేళ్లుగా ప్రొద్దుటూరు– కడప మధ్య తిరిగే ఆర్టీసీ అద్దెబస్సుకు డ్రైవర్‌గా వెళ్లేవాడు.

ప్రతిరోజు ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంలో ప్రొద్దుటూరుకు వెళ్లి అక్కడ వాహనాన్ని ఉంచి డ్యూటీకి వెళ్తాడు. డ్యూటీ ముగిసిన తర్వాత  తిరిగి బైక్‌ పై ప్రొద్దుటూరు నుంచి ఇంటికి చేరుకుంటాడు. అందులో భాగంగా మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్‌ పై ఇంటికి బయలుదేరాడు. మరి  కొద్ది సేపటిలో ఇంటికి చేరుకునే సమయంలో దారిలో కాపు కాచిన వ్యక్తులు అతని పై దాడిచేసి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. 

బుధవారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు
మృతుడు పీరయ్య డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నట్లు తల్లి బయమ్మకు రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. తిరిగి కొద్దిసేపటికి తల్లి ఫోన్‌ చేస్తే వనిపెంట నుంచి వస్తున్నాను అని చెప్పాడు. అయితే రాత్రి అంతా ఇంటికి రాలేదు. కుమారుని కోసం తల్లి, తమ్ముడి కోసం అన్న అందరికి ఫోన్‌ చేసి విషయం కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా పీరయ్యను అతి దారుణంగా కత్తితో నరికి చంపినట్లు గుర్తించారు.  వెంటనే సోదరుడు పెద్ద పీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

న్యాయం చేయాలంటూ ధర్నా
తమ కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతుని బంధువులు రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ధర్నా విరమింప జేశారు. 

పథకం ప్రకారమే హత్య..
పీరయ్యను అతని బంధువులే కాపు కాచి హత్య చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. మృతుడు గతంలో తమ దూరపు బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఆమెకు మూడేళ్ల క్రితం వివాహమైనట్లు సమాచారం. వివాహం అయిన తరువాత కూడా ఇద్దరి మధ్య సంబంధం అలాగే కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే కడప పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి అతనిపై తీవ్ర కక్ష పెంచుకున్న వారు అతని రాకపోకల పై నిఘా ఉంచి మంగళవారం రాత్రి కాపు కాచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది. మృతుడు పీరయ్య సోదరుడి ఫిర్యాదు మేరకు మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top