గుడ్డు ఘనం.. లోపల శూన్యం

ostrich eggs wastage in visakha zoo - Sakshi

ఆరిలోవ(విశాఖ తూర్పు): మనకు తెలిసి కోడి గుడ్లు 50 నుంచి 60 గ్రాముల వరకు బరువు తూగుతాయి. అంతకన్నా ఎక్కువ బరువున్న గుడ్లు అరుదుగా ఉంటాయి. మరి గుడ్డు రెండు కిలోల బరువుంటే?.. అది ఓ మోస్తరు ఒత్తిడికి కూడా పగిలిపోకుండా ఉంటే?.. అబ్బురంగా ఉంటుంది కదూ. అంత బరువున్న గుడ్డు నిప్పు కోడి (ఆస్ట్రిచ్‌ది).. విశాఖ జూలో ఈ పక్షి కాని పక్షి కనిపిస్తుంది. భారీ ఆకారంలో ఉండే ఈ ఆస్ట్రిచ్‌లు విశాఖ జూలో మూడున్నాయి.

ఆడ ఆస్ట్రిచ్‌లు క్రమం తప్పకుండా గుడ్లు పెడుతున్నాయి. దురదృష్టమేమంటే ఈ గుడ్లు ఎందుకూ పనికిరాకుండా డొల్లబారిపోయాయి. గుడ్లను పొదిగించి పిల్లలు చేయించాలని జూ అధికారులు ఏడాది కిందటి నుంచి తెగ ఆరాటపడ్డారు. . ఏడాది కాలంలో ఈ ఆస్ట్రిచ్‌లు 26 గుడ్లు పెట్టాయి. ఈ గుడ్లును పొదిగించి పిల్లలు చేయించాలని అధికారులు తలచారు. అయితే వారి ఆశలు తీరలేదు.

ఆ గుడ్లన్నీ డొల్లబారిపోయాయి. ఈ గుడ్లను అధికారులు ఆస్పత్రిలో ఓ మూలన అట్టపెట్టెల్లో పెట్టి భద్రపరిచారు. వాటికి చిన్న రంధ్రాలు చేసి వాటి లోపల వ్యర్థాలను తొలగించారు. వాటిని సందర్శకుల కోసం కొద్ది రోజుల్లో జూ మ్యూజియంలో ఉంచుతామని అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top