పోలీసుల అదుపులో ‘ఓయూ ఆగంతుకుడు’

Osmania University Ladies Hostel Thief Arrest in Hyderabad - Sakshi

సెల్‌ఫోన్ల చోరీ కోసమే లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశం

ప్రధాన నిందితుడు రమేష్, సహకరించింది సోని

రెండో వ్యక్తిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

తార్నాక: ఉస్మానియా యూనివర్శిటీలో లేడీస్‌ హాస్టల్‌లో ప్రవేశించింది పాత నేరస్తుడు పొట్టేళ్ళ రమేష్‌గా తేలింది. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని రాచకొండ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్‌లో చోరీకి అతడికి సహకరించిన మరో నిందితుడు సోనీని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం  రాత్రి పట్టుకున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో లేడీస్‌ హాస్టల్‌కు భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ ద్వయం ఓయూ హాస్టల్‌లోకి ప్రవేశించడానికి కొద్దిసేపటి ముందు అదే పరిధిలో మరో సెల్‌ఫోన్‌ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, వెల్దండకు చెందిన పొట్టేళ్ళ రమేష్‌ నగరానికి వలసవచ్చి బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా కూలీ అయినా ఇతడి ప్రవృత్తి మాత్రం ఇళ్ళల్లో చోరీలు చేయడం. ఇప్పటికే ఇతడిపై మూడు కమిషనరేట్లలో పలు కేసులు నమోదయ్యాయి. మీర్‌పేట పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. రమేష్‌ తనకు జైల్లో పరిచయమైన కాచిగూడ వాసి సన్నీ అలియాస్‌ సోనీతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. సన్నీపై ముషీరాబాద్, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌ పరిధుల్లో అక్రమ మద్యం కేసులు ఉన్నాయి. నారాయణగూడ ఎౖMð్సజ్‌ పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరద్దరూ కలిసి ఈ నెల 15 రాత్రి దొంగతనాలకు బయలుదేరారు. 16 తెల్లవారుజామున  జామై ఉస్మానియా వద్ద ఉన్న గుడిసెల వద్దకు వెళ్ళారు.

సోనీ బయటే ఉండిపోగా రమేష్‌ లోపలకు వెళ్ళి ఓ సెల్‌ఫోన్‌ పట్టుకుని వచ్చి అతడికి అప్పగించాడు. అక్కడి నుంచి వీరిద్దరూ నేరుగా ఉస్మానియా వర్శిటీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. లేడీస్‌ హాస్టల్‌ భవనానికి ప్రాంతంలో కంచె సరిగ్గా లేకపోవడం రమేష్‌కు కలిసి వచ్చింది. అక్కడ ఉన్న ఓ చెట్టు సాయంతో గోడ దూకిన అతను లేడీస్‌ హాస్టల్‌ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి లోపలకు వెళ్ళి ఓ సెల్‌ఫోన్‌ తస్కరించాడు. తిరిగి బాత్‌రూమ్‌ ద్వారానే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా... అటుగా వచ్చిన ఓ విద్యార్థిని కంట పడ్డాడు. అతడిని పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో పెనుగులాట జరిగి దాడి చేశాడు. వచ్చిన దారిలోనే పరారైన రమేష్‌ రెండో సెల్‌ఫోన్‌ను సోనికి ఇచ్చాడు. ఈ ఉదంతంపై ఉస్మానియా యూనివర్శిటీ ఠాణాలో కేసు నమోదు కావడంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే రాచకొండలో జరిగిన అనేక చోరీ కేసుల్లో రమేష్‌ ప్రమేయం ఉంది. వివిధ ఘటనాస్థలాల్లో దొరికిన వేలిముద్రలు అతడే నేరాలు చేసినట్లు నిరూపించాయి. దీంతో రమేష్‌ కోసం మూడు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్న సరూర్‌నగర్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఓయూ కేసు దర్యాప్తు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి సోనిని పట్టుకున్నారు. ఇతడి నుంచి మూడు చోరీ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు రమేష్‌ కోసం ఆరా తీయగా, అతడు రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతడు చేసిన నేరాలకు సంబంధించిన రికవరీలు చేయడంపై  అధికారులు దృష్టిపెట్టారు. త్వరలో రమేష్‌ను అధికారికంగా రాచకొండ పోలీసులు అరెస్టు ప్రకటించనున్నారు. ఆపై ఉస్మానియా వర్శిటీ పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి ఓయూ లేడీస్‌ హాస్టల్‌ కేసులో అరెస్టు చూపించనున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top