కాళ్ల పారాణి ఆరనేలేదు..

One Killed In Road Accident In Vizag - Sakshi

కాళ్ల పారాణి ఆరనేలేదు.. బుగ్గన చుక్క చెరగనేలేదు.. పట్టుచీరల రెపరెపలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.. కొత్త బంధాలు పెనవేసుకొని నూతన వధూవరుల మనసులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాయి.. అంతలోనే ఎంత ఘోరం! పెళ్లి వారింట తీరని విషాదం! భార్యను తీసుకొని అత్తవారింటికి వెళుతున్న కొత్త పెళ్లికొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కలలు కల్లలు కాగా ఆశలు ఆవిరైన క్షణాన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ నవ వధువును ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లికి చెందిన శంకర్‌ సిరివర్ష మృతి చెందాడు. 

ఎస్‌.రాయవరం (పాయకరావుపేట) : పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ ఆ చూడచక్కని జంటను చూసి విధికి కూడా కన్ను కుట్టినట్టుంది.. రోడ్డు ప్రమాదం రూపంలో కొత్త పెళ్లి కొడుకును బలి తీసుకుంది. నవ వధువుకు విషాదం మిగిల్చింది. ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన శంకర్‌ సిరివర్ష (25) అనే యువకుడికి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన లక్ష్మీప్రభతో గత బుధవారం రాత్రి అనకాపల్లిలో వివాహమైంది. వధూవరులు, మహాలక్ష్మి అనే మరో మహిళ  శనివారం సాయంత్రం కారులో రామచంద్రపురానికి బయలుదేరారు. పెళ్లికొడుకే కారు నడుపుతున్నాడు. గోకులపాడు సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న లారీని దాటే ప్రయత్నంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో శంకర్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వధువు, వారితో వెళుతున్న మరో మహిళ గాయపడ్డారు. 

నవ వధువు కన్నీరుమున్నీరు
నూరేళ్లు కలిసి జీవిస్తాడనుకున్న భర్త కళ్లు ముందే కనుమూయడంతో వధువు లక్ష్మీప్రభ ఆర్తనాదా లు మిన్నంటాయి. ఆమెను ఏ ఒక్కరు ఓదార్చలేకపోయారు. వధువు మెడలో పెళ్లి పసుపుబొత్తు, వధువు బుగ్గన చుక్క, మృత్యవాత పడిన శంకర్‌సిరివర్ష తలపై రక్తస్రావం చూసిన స్థానికులు సైతం కదిలిపోయారు. ఇంతటి ఘోరం ఏ కుటుంబం లోనూ జరగరాదని దేవుడిని వేడుకున్నారు. రక్తపుమడుగులో పడివున్న భర్తను చూసి లక్ష్మీప్రభ గుండెలవిసేలా విలపిస్తోంది. అనకాపల్లి గ్రామానికి చెందిన కోరుకొండ శకర్‌సిరివర్ష (25)కు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన లక్ష్మీప్రభతో గత బుధవారం రాత్రి అనకాపల్లిలో వివాహం జరిగింది.

మూడు రోజుల కార్యక్రమాలు ముగిశాక వధూవరులు రామచంద్రపురానికి శనివారం సాయంత్రం సొంత కారులో బయలుదేరారు. వారితోపాటు తోడు పెళ్లి కూతురు మహాలక్ష్మి బయలు దేరారు. లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా లారీ వెనుక భాగం తగలడంతో కారు నుజ్జునుజ్జయింది. బెలూన్లు ఓపెన్‌ అయినా శంకర్‌సిరివర్ష తలకు తీవ్రగాయం కావడంతో ఫలితం లేకపోయింది. వధువు లక్ష్మీప్రభ, మహలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌.రాయవరం హెడ్‌ కానిస్టేబుల్‌ వాసు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, గాయపడిన వారిని ఆటోల్లో నక్కపల్లి ఆసుపత్రికి చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top