పెరుగుతున్న మహిళా డ్రంకర్ల సంఖ్య

The number of female drunkers growing - Sakshi

గ్రేటర్‌లో పెరుగుతున్న ఉమెన్‌ డ్రంకన్‌ డ్రైవర్ల సంఖ్య

ఈ ఏడాది ఇప్పటికే 28 మందిపై కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో :  ‘గచ్చిబౌలి పరిధిలోని డీఎల్‌ఎఫ్‌ చౌరస్తా... మంగళవారం అర్ధరాత్రి సమయం... ఓ మహిళ మద్యం మత్తులో వాహనం నడుపుతూ వచ్చి మరో వాహనాన్ని ఢీ కొట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె వాహనం స్వాధీనం చేసుకున్నారు.’ మద్యం తాగి వాహనాలు నడిపే వారు...

ఈ మాట వింటూనే అందరి మదిలో మెదిలేది పురుషులే. అయితే, నగరంలో చిక్కుతున్న ‘డ్రంకన్‌ డ్రైవర్స్‌’లో యువతులు, మహిళలు కూడా ఉంటున్నారపడానికి ఇదే తాజా ఉదాహరణ. వీరి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 28 మంది డ్రంక్‌ ఉమెన్‌ డ్రైవర్స్‌ దొరికిపోయారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మహిళల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారి నుంచి గృహిణుల వరకు ఉన్నారని అధికారులు చెప్తున్నారు.  

విద్యాధికులు, ఉన్నతోద్యోగులు... 

మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన యువతులు/మహిళలు 21 నుంచి 35 ఏళ్ళ మధ్య వయస్కులే ఉన్నారు. వీరిలో మేనేజ్‌మెంట్‌ సహా ఇతర రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఎక్కువ. గృహిణుల మొదలు డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బీపీఓ ఉద్యోగులు... ఇలా పలువురు మహిళలు మద్యం తాగి తేలికపాటి వాహనాలను డ్రైవ్‌ చేస్తూ ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్స్‌లో పట్టుబడ్డారు.

ఇప్పటి వరకు చిక్కిన వారిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీసులకు దొరికిన వారే. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో చిక్కిన 21 ఏళ్ల బీపీఓ ఉద్యోగిని పిన్నవయస్కురాలు కాగా... ఎల్లారెడ్డిగూడలో పంజగుట్ట పోలీసులకు పట్టుబడిన 35 ఏళ్ళ గృహిణి పెద్ద వయస్కురాలు.  

ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి... 

నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ మహిళా డ్రంకన్‌ డ్రైవర్ల బెడదలేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగం అధికారులు వారంలో నగరంలోని 25 నుంచి 35 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి ఈ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నారు. మహిళా సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రతి బృందంలోనూ ఉమెన్‌ కాప్స్‌ను ఉంచడం సాధ్యం కావట్లేదని చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మహిళా డ్రంకన్‌ డ్రైవర్ల కదలికలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయనే దానిపై ఓ పరిశీలన చేశారు. ఇందులో సంపన్నులు నివసించే పశ్చిమ మండలంతో పాటు ఉత్తర మండలంలోని ప్రత్యేక బృందాల్లో మహిళా టీమ్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కొన్ని పబ్స్, హోటల్స్‌ ఎంపిక చేసుకున్న రోజుల్లో లేడీస్‌ నైట్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఆ రోజు సదరు పబ్‌ లేదా హోటల్‌కు వెళ్లే యువతులు/మహిళలకు నిర్వాహకులు ఉచితంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా రోజుల్లో, ఆయా ప్రాంతాల్లోనే ఈ మహిళా డ్రంకన్‌ డ్రైవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మహిళా పోలీసుల లేమి సమస్యతో... 

గడిచిన ఏడున్నరేళ్ళల్లో చిక్కిన 123 మంది మహిళలూ అసంకల్పితంగా పోలీసులకు పట్టుబడిన వారే. వీటితో పాటు తాజాగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను పరిగణలోకి తీసుకుని యువతులు/మహిళలపైనా ఈ డ్రవ్‌ చేపట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. అయితే వీరిని తనిఖీ చేసే సమయంలో డ్రైవ్‌ చేపడుతున్న బృందంలో కచ్చితంగా మహిళా పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది.

గతంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రాఫిక్‌ వింగ్‌లో మహిళా సిబ్బంది సంఖ్య అతిస్వల్పంగా ఉండటంతో పాటు వీరిని వినియోగించి డ్రైవ్స్‌ చేపడితే... అవి పూర్తయిన తర్వాత వీళ్ళు తమ ఇళ్ళకు వెళ్ళడం పెద్ద సవాల్‌గా మారుతోంది. ఇలాంటి అనేక కారణాలతో లేడీస్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌ సాధ్యం కావట్టేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నామమాత్రపు సిబ్బందితో అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతున్నారు.  

శాంతిభద్రతల విభాగం సహకారం ఉంటే..

నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వారి కోసమూ స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే మహిళలకు సంబంధించి డ్రైవ్స్‌ చేయడం, వీరిని పట్టుకోవడం ఒక ఎత్తయితే... కేసు నమోదు తర్వాత వారిని సేఫ్‌గా ఇంటికి చేర్చడం మరో ఎత్తుగా మారుతోంది.

మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల వాహనం స్వాధీనం చేసుకుంటారు. ఇలా చేస్తే ఆ సమయంలో యువతులు/మహిళలు వారి ఇళ్ళకు చేరడం ఎలా అనేది ట్రాఫిక్‌ పోలీసులకు ఎదురవుతున్న మరో సవాల్‌. ట్రాఫిక్‌ వింగ్‌లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆయా రోజుల్లో శాంతిభద్రతల విభాగం నుంచి మహిళా కానిస్టేబుళ్లను తీసుకుని, డ్రైవ్స్‌ అనంతరం వారిని సేఫ్‌గా ఇళ్లకు చేర్చాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top