పెళ్లయిన రెండు నెలలకే..

Newly Married Woman Suicide In Vikarabad - Sakshi

రాజేంద్రనగర్‌ : అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన కృతిక (25)కు అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డితో గత మార్చి 10వ తేదీన వివాహమైంది. భర్త రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండగా కృతిక ఓ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తోంది. పెళ్లయిన అనంతరం వీరిద్దరూ రాజేంద్రనగర్‌ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో కాపురం పెట్టారు. అయితే నెల కిందట కృతిక తండ్రి హైబీపీకి గురయి కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె సపర్యలు చేస్తోంది. రోజు ఆస్పత్రికి వెళ్లి తండ్రికి సేవలు చేస్తూ వస్తోంది. తండ్రి అనారోగ్యం బారినపడడంతో కృతిక మనోవేదనకు గురైంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం కృతిక తన తల్లికి ఫోన్‌ చేసి వికారాబాద్‌ వస్తున్నట్లు తెలిపింది.

ఆ తర్వాత ఎంతకీ కూతురు రాకపోవడంతో తల్లి రాత్రి ఫోన్‌ చేసింది. అయితే కృతిక బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అల్లుడు రామకృష్ణారెడ్డి తెలిపాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పెళ్లయిన రెండు నెలలకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో మృతురాలి తల్లి కన్నీరుమున్నీరైంది. అయితే ఆమె తండ్రిపై దిగులుతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top