పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

Murder of YSRCP activist in Palnadu - Sakshi

నరికి చంపిన టీడీపీ వర్గీయులు 

నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో ఘటన

హత్యను ఖండించిన ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి 

నరసరావుపేట రూరల్‌/నరసరావుపేట టౌన్‌: గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కోనూరి హరికిరణ్‌ చౌదరి (36)ని టీడీపీ గూండాలు బుధవారం నరికి చంపారు. మృతుడు కిరణ్‌ ఉదయం 9 గంటల సమయంలో గ్రామంలోని రామాలయం సెంటర్‌లో ఉండగా, అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్డులతో విచక్షణా రహితంగా తలపై నరకడంతో కిరణ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. జనసంచారం అధికంగా ఉన్న చోటే హత్య జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మృతుడు కిరణ్‌కు ఇక్కుర్రు గ్రామానికి చెందిన టీడీపీనేత, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ బొడ్డపాటి పేరయ్యకు మధ్య వివాదాలున్నాయి.

ఈ నేపథ్యంలో పేరయ్య వియ్యంకుడు అల్లూరివారిపాలేనికి చెందిన ఉడతా పుల్లయ్య 2013లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కిరణ్‌తో పాటు పాలగాని శ్రీనివాసరావు నిందితులు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. మృతుడి సోదరి భాగ్యలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన సోదరుడు కిరణ్‌ను ఇక్కుర్రు గ్రామానికి చెందిన బొడ్డపాటి పేరయ్య, కొల్లి వెంకటేశ్వర్లు, కనుమూరి రమేష్, అల్లూరివారి పాలేనికి చెందిన ఉడతా రాఘవ, చెరుకూరి సాంబశివరావు, ఉడతా వెంకయ్యచౌదరితో పాటు మరికొందరు కలిసి హత్య చేశారని పేర్కొన్నారు. కాగా, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. హరికిరణ్‌ చౌదరి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top